రూ.11 లక్షలకు..డీల్‌!

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఇటీవల కాలంలో తెనాలి ప్రాంతంలో జరిగిన ఓ క్రిమినల్‌ కేసును ఛేదించే విషయంలో మొదటి నుంచి పోలీసుల పాత్రపై అనేక విమర్శలు వచ్చాయి.

రూ.11 లక్షలకు..డీల్‌!

 కేసు నీరుగార్చేందుకు వసూల్‌

తెనాలిలో ఓ పోలీస్‌బాస్‌పై ఆరోపణలు 

విచారణ సమయంలో కేసు తీవ్రత తగ్గింపుకోసం ఇచ్చినట్టు ప్రచారం

నిందితులకు గెస్ట్‌హౌస్‌లో రాచమర్యాదలు!

కాపలా ఉన్న సిబ్బందికి డబ్బు అందకపోవటంతో బయటకు పొక్కిన వ్యవహారం

తెనాలిలో ఓ సీఐపై జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లకు ఆకాశరామన్న లేఖలు

 

ఒకటి కాదు... రెండు కాదు. రూ.11 లక్షలు చేతులు మారాయి. ఒక క్రిమినల్‌ కేసును నీరుకార్చేందుకు కొందరు ప్రముఖులు పావులు కదిపారు. స్టేషన్‌లో ఉండాల్సిన నిందితులను కోర్టులో హాజరు పరిచేవరకు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. డబ్బిచ్చినప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే కేసులో నిందితులకు రాచమర్యాదలు కూడా అందాయి. వారికి కాపలా ఉన్న సిబ్బంది వాటాలు అందకపోవటంతో గుట్టుగా జరిగిన ఒప్పందం బయటకు పొక్కింది. ప్రస్తుతం తెనాలి పట్టణంలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.

 

 

తెనాలి, మార్చి5(ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో తెనాలి ప్రాంతంలో జరిగిన ఓ క్రిమినల్‌ కేసును ఛేదించే విషయంలో మొదటి నుంచి పోలీసుల పాత్రపై అనేక విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు నిందితులను అరెస్టుచేసి, కోర్టుకు హాజరు పరిచారు. ఇదంతా జరిగిన తర్వాతే అసలు కఽథ మొదలైంది. ఈ కేసును నీరు కార్చేందుకు ఓ పెద్దమనిషి ద్వారా పోలీసులకు డీల్‌ కుదిరినట్టు చెబుతున్నారు. పట్టణంలోని ఒక పోలీస్‌స్టేషన్‌ బాస్‌ పాత్రపైనే కీలక ఆరోపణలు సాగుతుండటం ఇక్కడ చర్చనీయాంశం. మొత్తంమీద రూ.11 లక్షలు చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. ఆ కేసులో నిందితులు తమంతట తాముగానే లొంగిపోయారని, వారిని కొట్టకుండా ఉండేందుకు, అరెస్టు తర్వాతకూడా ఇబ్బందిలేకుండా చూడటం, కేసును నీరుకార్చటం వంటి ఒప్పందంతోనే ఈ డీల్‌కు పావులు కదిపారని సమాచారం. నిందితులు పోలీసుల దగ్గరకు వచ్చాక, అరెస్టు చూపేవరకు స్టేషన్‌ సెల్‌లో ఉంచకుండా అష్టలక్ష్మి గుడి ఎదురు రోడ్డులోని ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో ఉంచినట్టు ప్రచారం. 


గుట్టు రట్టయింది ఇలా.. 

అయితే వీరి దగ్గర నలుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారు. వారే అరెస్టు రోజు కోర్టుకు తీసుకువెళ్లటానికి కూడా ఉన్నారు. నిందితుల దగ్గర తీసుకున్న మొత్తం కాకుండా నాలుగు రోజులు కాపలా ఉన్నందుకు ఆ నలుగురి కోసం ఒక్కొక్కరికి రూ.25వేల వంతున మరో రూ.లక్ష ఆ ఉన్నతాధికారి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే వారికి రూ.25వేల వంతున కాకుండా కేవలం రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన మొత్తాన్నికూడా ఆ అధికారే జేబులో వేసుకున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా తిరిగిన కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇవ్వాలని చెప్పి తీసుకున్న మొత్తంలో ఒక్క రూపాయికూడా ఇవ్వలేదని, పేపర్‌ ఖర్చుల కింద రూ.10వేలు ఇచ్చి, మిగిలినవన్నీ ఆయన జేబులోనే వేసుకున్నారని ఆ సిబ్బందికూడా బహిరంగంగానే ఆరోపిస్తున్నారని చెబుతున్నారు.  దీనిలో కీలకంగా పోలీసుల పాత్రపై ఆరోపణలుంటే, వీరితోపాటు కొందరు మీడియా ప్రతినిధులకు కూడా కొంత డబ్బు ముట్టచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అయితే డివిజనల్‌ స్థాయి పోలీసు అధికారి లంచాలు ఆశించరని, అందువల్లే ఆమెకు ఈ వ్యవహారంలో ఒక్క రూపాయి అందకపోగా, ఆమె పేరుచెప్పి మరీ ఆ అధికారే అదనంగా డబ్బు గుంజారనే ఆరోపణా ఉంది. 

 

సీసీ కెమెరాల ఫుటేజీల సేకరణ..?

ఈ ప్రచారం ఊపందుకోవటం, గెస్ట్‌హౌస్‌ దగ్గర సీసీ కెమెరాల్లో వీడియోల ఆధారంగా ఆ ఉన్నతాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలియటంతో క్షణాల్లోనే అక్కడి కెమెరాల ఫుటేజీలను తొలగించేందుకు ఆ అఽధికారి వత్తిడి చేశారని సమాచారం. కొన్ని తొలగిస్తే, వీధిలో ఉన్న కెమెరాల ఫుటేజీలను తీసుకునే ప్రయత్నంలో కిందిస్థాయి సిబ్బంది ఉన్నారని, అవికనుక దొరికితే రూ.లక్షలు చేతులు మారిన విషయం బయటపడకున్నా, నిబంధనలకు విరుద్ధంగా నిందితులను గెస్ట్‌హౌస్‌లో ఉంచిన ఆధారాలైనా సాక్ష్యంగా నిలుస్తాయనే ప్రయత్నంలో ఉన్నారనేది సమాచారం. 

  

సీఐపై రూరల్‌ ఎస్పీకి ఆకాశరామన్న లేఖ

ఇదిలా ఉంటే మా సీఐ గారు కిందిస్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని ఒక ఆకాశరామన్న లేఖ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు అందించి. రూరల్‌ ఎస్పీకి అడ్రస్‌చేసి రాస్తూ, కాపీని డీఐజీకి కూడా పంపుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ లేఖలన్నీ గుంటూరు, దీనికి చుట్టుపక్కల ఉన్న పోస్టాఫీసుల నుంచే రావటం విశేషం. తెనాలి పట్టణంలోని ఒక టౌన్‌ సీఐపైనే ఈ లేఖలో ఆరోపణలు చేశారు. ఉన్న సిబ్బందిని పీసీఆర్‌కు పంపి, దుగ్గిరాల నుంచి ఆయనకు నచ్చిన కానిస్టేబుల్‌ ఒకరిని పిలిపించుకుని అతని ద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. కేసు తీవ్రతనుబట్టి రేటు నిర్ణయించి రూ.లక్షల్లో లంచాలు దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.10వేల వంతున వసూలు చేస్తున్నారని, ఇచ్చినవారికి నిబంధనలతో పనిలేకుండా వదిలేస్తున్నారనేది వారి ఆరోపణ. గస్తీ తిరిగే సిబ్బందికి బ్లూకోడ్స్‌ వాహనాలు ఇవ్వకుండా సొంతవాటిపై తిప్పుతూ కనీసం ప్రభుత్వం అందించే ఆయిల్‌ డబ్బుకూడా ఇవ్వటంలేదని, సీఐతోపాటు అదే స్టేషన్‌లో పనిచేసే మరో ఎస్‌ఐ పేరునూ ప్రస్తావించటం విశేషం. వీరిద్దరు కాకుండా ఒక మహిళా కానిస్టేబుల్‌ పేరుకూడా దీనిలో ప్రస్తావిస్తూ, ఆమె 7 సంవత్సరాలుగా విధులకు రాకుండా ఇంటిదగ్గరే ఉండి జీతం తీసుకుంటుంటే ఉన్నతాధికారులు పట్టించుకోవటంలేదని, చివరకు అసెంబ్లీ బందోబస్తుకు కూడా ఆమె రాకపోయినా వదిలేయటం ఆంతర్యమేమిటనేది తేల్చాలని లేఖలో డిమాండ్‌ చేశారు. మా ఫిర్యాదుపై స్పందించరని తెలుసని, పైగా మాపైనే చర్యలు తీసుకుంటారని తెలిసికూడా వారి బాధపడలేక చివరకు ఆకాశరామన్న పేరుతో లేఖ రాస్తున్నామని, ఏమాత్రం చిత్తశుద్దిఉన్నా దీనిపై విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా రోజుకు కొన్ని స్టేషన్‌లకు ఈ లేఖలు అందుతున్నాయని చెబుతున్నారు. 


విచారణకు సిద్ధమే.. 

అయితే దీనిపై సీఐని వివరణ కోరితే, డ్యూటీ చేయటం ఇష్టంలేని, డబ్బు వసూళ్లకు అలవాటుపడినవారిని నియంత్రించటం వల్లే తనపై ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బహిరంగంగా నిరూపించలేక ఆకాశరామన్న పేరుతో లేఖలు పంపుతున్నారని, ఒక్క కానిస్టేబుల్‌తోకూడా తన ఇంటిదగ్గరి పనులు చేయించుకోలేదని, మిగిలిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమేనని, అయితే తోటి సిబ్బందే ఈ తరహా నిందలు వేసేందుకు ప్రయత్నించటం బాధాకరమన్నారు. అయితే సిబ్బందే ఈ లేఖలు పంపారా! లేక ఏదైనా కేసులో నిందితులు వారి పేరుతో లేఖలు వేశారా అనేదికూడా తేలాల్సి ఉందన్నారు. మొత్తంమీద గడిచిన పదిరోజుల నుంచి తెనాలి పట్టణంలో వరుస సంఘటనలతో కీలక చర్చకు కారణమవుతున్న పోలీసులపై వస్తున్న ఆరోపణలలో నిజం ఎంతనేది విచారణలో తేలాల్సిందే.

  

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST