పెన్షన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-10-07T05:57:10+05:30 IST

: పండుగంటే సరదాలు, సంతోషాలు, సంబరాలు, బంధువుల రాకపోకలు, సందళ్లు, పిండివంటలు, కొత్తబట్టలు, కొత్త వస్తువులు, షికార్లు.. ఇలా ఎన్నో ఉంటాయి.

పెన్షన్‌..  టెన్షన్‌!

దసరా వెళ్లినా చేతికి రాని పెన్షన్‌ సొమ్ము

ఉద్యోగులకూ తప్పని ఎదురు చూపులు

ప్రతినెలా ఇదే తంతు.. 75 వేల మందికి తిప్పలు


గుంటూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పండుగంటే సరదాలు, సంతోషాలు, సంబరాలు, బంధువుల రాకపోకలు, సందళ్లు, పిండివంటలు, కొత్తబట్టలు, కొత్త వస్తువులు, షికార్లు.. ఇలా ఎన్నో ఉంటాయి. అందునా దసరా అంటే ఇక చెప్పనే అవసరం లేదు. పిల్లల స్కూళ్లకు కూడా సెలవులు ఇస్తారు కాబట్టి ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకుని ఉంటారు. అయితే ప్రభుత్వ నిర్వాకం కారణంగా వేతన, విశ్రాంత జీవులంతా ఈ ఏడాది దసరా సరదాలకు దూరం కావాల్సి వచ్చింది. ఒకటో తేదీన రావాల్సిన వేతనాలు పండుగ వచ్చినా రాకపోవడంతో వారి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకూ ఎదురు చూసీ, చూసీ విసిగి వేశారారు.


 అందరికీ దక్కని వేతనాలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగులతో కలిపి సుమారు 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందాలి. అయితే గత మూడేళ్లుగా ఒకటో తేదీన అందిన దాఖలాలు లేవు. ఈ నెల 5వ తేదీన దసరా పండుగ ఉండడంతో ఒకటో తేదీన వేతనాలు పడతాయని ఉద్యోగులు భావించారు. అక్టోబరు 1న అందాల్సిన వేతనం దసరా వచ్చేవరకూ చాలా మందికి అందలేదు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకూ జిల్లాలోని 20 శాతం మందికి కూడా వేతనాలు రాలేదు. నాలుగో తేదీ సాయంత్రానికి సగంమంది ఉద్యోగులకు వేతనాలు అందినా మిగిలినవారు మాత్రం పండుగ అయ్యేవరకూ నిరీక్షించక తప్పలేదు. ఇక విశ్రాంత ఉద్యోగుల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. ఒకటో తేదీ పెన్షను కళ్లజూసి ఏళ్లు గడిచిపోయాయని వారు వాపోతున్నారు. పండుగకు కూడా పెన్షన్లు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. పండుగ సంతోషాల మాటేమోగానీ కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక వారు పడరాని పాట్లు పడుతున్నారు.


39 వేల మంది విశ్రాంత ఉద్యోగుల పడిగాపులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 39 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారిలో 90 శాతం మంది వయోభారం, అనారోగ్యాల కారణంగా పని చేయలేని స్థితిలో ఉన్నారు. వారంతా పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకటో తేదీన వచ్చే పెన్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు. కాగా ఒకటో తేదీ పెన్షన్‌ వచ్చి ఏళ్లు గడిచిపోయిందని వారు వాపోతున్నారు. ఒకటోతేదీ పెన్షన్‌ రాని కారణంగా చేతిలో డబ్బులు లేక రోజువారీ ఆహార అవసరాలు, మందులు, వైద్య అవసరాలకు కూడా చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలామంది పెన్షనర్లు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. 


 జీతాలు రాక.. కొత్త వస్తువులు కొనలేక

దసరా పండుగ సందర్భంగా కొత్త సామాన్లు, బట్టలు కొనడం సంప్రదాయం. దసరా సందర్భంగా వచ్చే డిస్కౌంట్లు, రాయితీల కారణంగా మెజారిటీ ప్రజలు వస్తువులు కొనుక్కుంటుంటారు. ఈ దసరాకు కూడా  కొత్త సామాన్లు, దుస్తులు కొనాలని ఎదురు చూసిన ఉద్యోగులు, విశ్రాంత జీవులు జీతాలు, పెన్షన్లు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. పండుగ తరువాత కొందామంటే రాయితీలు, డిస్కౌంట్లు పోయి వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. ఇక నెలవారీ ఈఎమ్‌ఐలు, గృహ రుణాల చెల్లింపులు, ఇంటి అద్దెలు, ఫైనాన్సులు, పాల బకాయిలు వంటి పలు చెల్లింపులు, పండుగ మామూళ్లకు కూడా ఈ నెల డబ్బులు లేకుండాపోయాయి. దీంతో అధిక వడ్డీకి అప్పులు తెచ్చిమరీ వాటిని చెల్లించాల్సి వచ్చింది. 


 సగం మందికి పెన్షన్లు రాలేదు..

నూటికి 70మంది విశ్రాంత ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనే ఆధారం. నాలుగు మెతుకులు తినాలన్నా, అవసరమైన వైద్యం చేయించుకోవాలన్నా పెన్షన్‌ అందాలి. ఇప్పటికీ సగం మందికి పెన్షన్లు రాలేదని చెబుతున్నారు. దసరా పండుగకు కూడా సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోవడం ఏమిటి? ఇకనైనా ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వాలి. 

- వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


Updated Date - 2022-10-07T05:57:10+05:30 IST