పత్తి సాగు.. పెరిగింది

ABN , First Publish Date - 2022-08-20T05:39:35+05:30 IST

పత్తి సాగుకు జిల్లా ప్రసిద్ధి. గత ఏడాది పత్తి సాగు తగ్గగా ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది తక్కువ విస్తీర్ణంలో పత్తి సాగవడంతో దిగుబడి తగ్గింది.

పత్తి సాగు.. పెరిగింది
పత్తి పొలం

జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో సాగు 

ఈ ఏడాది గణనీయంగా పెరుగుదల

 

నరసరావుపేట, ఆగస్టు 19: పత్తి సాగుకు జిల్లా ప్రసిద్ధి. గత ఏడాది పత్తి సాగు తగ్గగా ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది తక్కువ విస్తీర్ణంలో పత్తి సాగవడంతో దిగుబడి తగ్గింది. దీంతో పత్తికి మంచి ధర లభించింది. ఈ కారణంగా ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు పత్తి సాగు వైపు  మొగ్గు చూపారు. పత్తి సాధారణ విస్తీర్ణం 3.25 లక్షలుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే  ఇప్పటికే 2.75 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ నెలాఖరు వరకు పత్తి సాగు చేసే అవకాశం ఉందని, సాగు విస్తీర్ణం మరింతగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఖరీఫ్‌లో 2.22 లక్షల ఎకరాలకే పత్తి సాగు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఖరీఫ్‌లో దాదాపు 53 వేల ఎకరాల్లో పత్తి సాగు పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఇదే స్థాయిలో వరి, మిరప సాగు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి సాగర్‌ కాల్వలకు నీరు విడుదల చేయడంతో వరి సాగు ఊపందుకుంది. మిరప కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు. మిరప సాధారణ విస్తీర్ణం 1,44,655 ఎకరాలుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటివరకు 18,907 ఎకరాల్లో మిరప సాగైంది. సీజన్‌ ఇంకా రెండు నెలలు ఉండటంతో మిరప సాగు పెరగవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-08-20T05:39:35+05:30 IST