పరిహారం..పరిహాసం

ABN , First Publish Date - 2022-10-18T05:12:59+05:30 IST

ఈ సంవత్సరం మేలో విరుచుకుపడిన అసాని తుఫాన్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అప్పట్లో అంచనా వేశారు.

పరిహారం..పరిహాసం
దుగ్గిరాల : పెదకొండూరులో వరద నీటిలో మునిగిన మిర్చిపంటను చూపుతున్న అన్నదాత

వర్షాలకు దాదాపు 4,000 ఎకరాల్లో పంటనష్టం 

ఇంకా నీటిలోనే పంటపొలాలు

క్షేత్రస్థాయి సర్వేపై యంత్రాంగం ఉదాసీనం

మేలో వచ్చిన అసాని తుఫాన్‌ పరిహారం ఊసేలేదు

తీవ్ర ఆందోళనలో అన్నదాతలు 


ఈ సంవత్సరం మేలో అసాని తుఫాన్‌ ఉమ్మడి గుంటూరు జిల్లాను చిగురుటాకులా వణికేలా చేసింది. దాదాపు పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాగా ఉంది. దీనిపై అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నష్టపరిహారం అంచనాలను పంపించింది. ఇక అంతే.. దాని గురించి పట్టించుకున్న వారే కరువయ్యారు. ఆ పరిహారం అందకముందే తాజా వానలతో పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యానపంటలకు తీవ్రనష్టం జరిగింది. అసాని తుఫాన్‌ పరిహారమే ఇప్పటికీ రాకపోవడంతో తాజాగా జరిగిన నష్టానికి సంబంధించి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోనని అన్నదాతలు మదనపడుతున్నారు.

 


బాపట్ల, పిడుగురాళ్ల, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): ఈ సంవత్సరం మేలో విరుచుకుపడిన అసాని తుఫాన్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అప్పట్లో అంచనా వేశారు. నష్టం దాదాపు రూ.వంద కోట్లకు పైబడే ఉంటుందని కూడా లెక్కలు గట్టారు. ఆయా శాఖలు ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించాయి. పాలకులు కూడా తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ఘనంగా ప్రకటించారు. దాని తర్వాత జరిగిన డీఆర్సీ సమావేశంలో కూడా తుఫాన్‌ నష్టాన్ని చర్చించి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు ఆ పరిహారం ఊసేలేదు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు, పంగులూరు ప్రాంతాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులకు అసాని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక లంక గ్రామాల్లో అత్యధికంగా సాగుచేసే అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయల రైతులను కూడా కోలుకోలేని దెబ్బతీసింది. వీరంతా ప్రభుత్వం పరిహారం ఎప్పుడు అందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 


తాజా వర్షాలతో మళ్లీ దెబ్బ..

తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా దాదాపు మూడు రోజుల పాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. వానల ధాటికి అన్నదాతలకు మళ్లీ దెబ్బ తగిలింది. వేరుశనగతో పాటు కూరగాయల పంటలు నీట మునిగాయి. వాణిజ్య పంటలకు సైతం తీరని నష్టం వాటిల్లింది. బల్లికురవ లాంటి ప్రాంతాల్లో ఏకధాటి వర్షాలకు కూరగాయల పంటలు ఉరకెత్తాయి. పొట్ల మీదున్న వరికి సైతం ఈ వర్షాలు నష్టాన్ని కలిగించాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు ప్రాంతంలో పత్తి పంటపై వరదనీరు ప్రవహించడంతో  నష్టం వాటిల్లింది. మరికొన్ని రోజుల్లో కాయలు పగిలి పంట చేతికొచ్చే వేళ ఈ వర్షాల వల్ల దిగుబడులలో సగానికి సగం తేడా వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు చెబుతున్నారు. గురజాల, పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి, మిరప, కంది పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అధిక వర్షాలకు గుత్తికొండ సమీపంలోని పత్తి, మిరప పంటలు నీట మునగగా గురజాల సమీపంలోని గాడిదల వాగు, అంబాపురం, పాలకేంద్రం సమీపాల్లో పత్తి, కంది, మిరప పంటలు పూర్తిగా నీటమునిగి ఉరకేసి పోయాయి. కొన్ని పొలాలు పూర్తిగా పాడైపోగా కొన్ని చోట్ల పత్తి, కంది ఉరకేసి ఎర్రబారి ఎందుకు పనికిరాని విధంగా తయారైంది. పెద్దమొత్తంలో ఖర్చు పెట్టి నాటిన మిరప మొక్కలు కూడా ఈ వర్షాల వల్ల ఉరకెత్తాయని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు.   వ్యవసాయ, ఉద్యానశాఖలు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసి నష్టంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల దాదాపు 4,000 ఎకరాలకు పైనే నష్టం జరిగినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.


తీర ప్రాంత రైతాంగానికి గట్టి దెబ్బ

కాల్వల్లో తూటుకాడ, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షాలకు కూడా పొలాలు వరద ముంపునకు గురవుతున్నాయి. పల్లపు ప్రాంతంలోని పొలాలు, కాల్వల దగ్గర ఉన్న పైర్లు వరదకు గురవుతున్నాయి. ఎకరాకు రూ.15వేలు పైనే ఈ వర్షాల వల్ల నష్టపోయామని అన్నదాతలు చెబుతున్నారు.



రేపు చంద్రబాబు పర్యటన

అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాలకు రైతులకు పరామర్శ 

 

నరసరావుపేట, అక్టోబరు 17: పల్నాడు జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. గురజాల, చిలకలూరిపేట నియోజక  వర్గాల్లో బుధవారం ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. వేలాది ఎకరాల్లో పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. గురజాల, చిలకలూరిపేట నియోజక వర్గాలలో పంటల నష్టం అధికంగా ఉండటంతో పార్టీనేతలు చంద్రబాబు పర్యటన ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో పత్తి 2,62,355 ఎకరాలలో మిరప 1,39,923 ఎకరాలలో సాగు చేశారు. అధిక వర్షాల వలన పత్తి, మిరప పంటలకు అపార నషం వాటిల్లింది. రైతలు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. చంద్రబాబు పర్యటనకు గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట నియోజక వర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాట్లు చేస్తున్నారు. నరసరావుపేటలో నిర్వహించ తలపెట్టిన మినీ మహానాడు వర్షాల కారణంగా రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మహానాడు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

 

Updated Date - 2022-10-18T05:12:59+05:30 IST