పంట నష్టం.. అపారం
ABN , First Publish Date - 2022-10-19T05:38:10+05:30 IST
అధిక వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లింది.
వాణిజ్య పంటలను కోల్పోయిన రైతులు
మూడు నియోజవర్గాల్లోనే నష్టం అధికం
వాతావరణ బీమా ఆదుకోనేనా ?
ప్రాథమికంగా 13 వేల ఎకరాల్లో నష్టం గుర్తింపు
పంట నష్టం అంచనా సమగ్రంగా జరిగితేనే రైతులకు మేలు
నరసరావుపేట, అక్టోబరు 18: అధిక వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి, మిరప, కంది, మినుము, పసుపు తదితర వాణిజ్య పంటలు ఉరకెత్తాయి. పత్తికాయలు కుళ్లిపోగా.. పూత రాలిపోయింది. పత్తి తొలికాపు వర్షార్పణం అయింది. మిరపమొక్కలు నీటిలోనే నానుతున్నాయి. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంటలను కోల్పోయిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 13వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. సమగ్రంగా పంటల నష్టాన్ని లెక్కించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాల్సి ఉంది. ఈ దిశగా ఇంకా చర్యలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరుసగా నాలుగో ఏడాది..
వరుసగా నాలుగవ ఏడాది కూడా అధిక వర్షాలు పంటలను ముంచేశాయి. జిల్లాలో పత్తి 2,62,355 ఎకరాల్లో సాగైంది. పత్తి తొలి కాపును రైతులు కోల్పోయారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. 1,39,923 ఎకరాల్లో మిరప సాగు చేశారు. మిరప పంట కూడా నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పంట పూత, కాయ దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో నెలరోజుల కాల వ్యవధిలో మిరప ఉంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో మిరప పూత, కాయ కుళ్లి రాలిపోతోంది. మిరప మొక్కలు ఉరకెత్తి ఎండుపోతున్నాయి. ఒక కాపు పూర్తిగా దెబ్బతిన్నట్టేనని రైతులు తెలిపారు. మిరప, పత్తి పంటలకు వర్షాలు భారీగానే నష్టపరిచాయి. వర్షాలు కొనసాగుతుండటంతో పత్తి, మిరప రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నెలలో అధిక వర్షపాతం నమోదు
పల్నాడు జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. ఈ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 118 మి.మీ సాధారణ వర్షపాతం కాగా 197.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 79.7 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. అధిక వర్షాలు కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. పెదకూరపాడు, గురజాల, చిలకలూరిపేట నియోజవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లాయి. దీనివలన పంట పొలాలు మునిగిపోయాయి. పెదకూరపాడు, అమరావతి, చిలకలూరిపేట, యడ్లపాడు, గురజాల మండలాల్లో పంటల నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రైతులను ఆదుకోనేనా ?
జిల్లాలో వాతావరణ బీమా అమల్లో ఉంది. పంట వివిధ స్టేజ్‌లలో కురిసిన వర్షపాతం ఆధారంగా ఈ బీమాను అమలు చేస్తారు. సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసిన సమయంలో దెబ్బతిన్న పంటలకు వాతావరణ బీమాను అమలు చేయాల్సి ఉంది. పత్తి, మిరప పంటలు ఈ బీమా పరిధిలోనే ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈకేవైసీ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు బీమా పరిహారం అందించాలి. వ్యవసాయ శాఖ రైతులు ప్రయోజనాలకు అనుగుణంగా పంట నష్టాన్ని అంచనా వేస్తే వాతావరణ బీమా వలన రైతులకు పరిహారం అందే అవకాశం ఉంటుంది. మొక్కుబడిగా కాకుండా సమగ్రంగా పంట నష్టం అంచనా జరిగితేనే రైతులుకు మేలు జరుగుతుంది. ఈ దిశగా వ్యవసాయ శాఖ కృషి చేయాలని బాధిత రైతలు కోరుతున్నారు. కనీసం వాతావరణ బీమా పరిహారం అందించ గలిగితే రైతులు కొంతైనా నష్టాల ఊబిలోనుంచి బయటపడగలుగుతారు.
నేడు చంద్రబాబు పర్యటన
నరసరావుపేట, అక్టోబరు18: పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం విస్తృతంగా పర్యటించనున్నారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను అయన పరిశీలిస్తారు. బాధిత రైతులను పరామర్శిస్తారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు తెలుసుకోనున్నారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10.40 గంటలకు నాదెండ్ల మండలం తిమ్మాపురం వస్తారు. ఇక్కడ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం 12 గంటలకు నాదెండ్ల, ఇదే మండలంలోని తూబాడు గ్రామాల పరిధిలోని పంట పొలాలను పరిశీలిస్తారు. 1.30 గంటలకు తూబాడు నుంచి నరసరావుపేట, నకరికల్లు, పిడుగురాళ్ళ మీదుగా గురజాల వెళతారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ సమీపంలో గుంటూరు రోడ్డులో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అధ్వర్యంలో నేతలు చంద్రబాబుకు స్వాతగం పలకనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య గురజాల ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులు తెలుసుకోనున్నారు. అనంతరం గురజాలలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే చంద్రబాబు పర్యటనకు మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయండి
జిలాలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పర్యటనలో పాల్గొనాలని ఆయన కోరారు.