నైరుతి.. నిరాశ

ABN , First Publish Date - 2022-06-25T05:28:07+05:30 IST

వివిధ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.. కానీ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆ జాడ లేదు.

నైరుతి.. నిరాశ
నరసరావుపేట : ఇస్సపాలెంలో పత్తి విత్తనం నాటేందుకు పొలం దున్నుతున్న రైతు

మూడు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం

చినుక రాలక అన్నదాతలు ఆందోళన

సాగుకు అనుకూలించని వాతావరణం

లోటు వర్షపాతంతో సాగు ప్రశ్నార్థకమే 

మబ్బులు కమ్ముకుంటున్నా కురవని వాన


నరసరావుపేట, వినుకొండ, జూన్‌ 24: వివిధ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.. కానీ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆ జాడ లేదు. మబ్బులు కమ్ముకుంటున్నాయి.. మేఘాలు మురిపిస్తున్నాయి.. కాని చినుకు రాలడంలేదు. ఒకవేళ ఎక్కడైనా వర్షం పడినా.. సాగుకు అనుకూలంగా భూమి పదునెక్కడంలేదు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందస్తుగా ప్రవేశిస్తాయి.. ఆశాజనకంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం జూన్‌ ప్రారంభంలోనే వరుణదేవుడు పలకరించగా రైతులు దుక్కిదున్ని విత్తనాలు నాటతారు. కాని జూన్‌ మాసం ముగుస్తున్నా వరుణుడు కనికరించలేదు. రోజులు గడుస్తున్నాయే కాని నైరుతి వర్షాలు కనికరించడంలేదు. నైరుతీ రుతుపవనాలపైనే మూడు జిల్లాల్లో సాగు ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో నైరుతి నిరాశతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రుతపవనాలు పలకరించకపోవడంతో చెరువులు, కుంటల్లో నీటి మట్టాలు తగ్గిపోయాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్లల్లో నీరు వట్టిపోయాయి. పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. 

చినుకు కినుకతో మూడు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లాలో 56.80 శాతం, గుంటూరులో 59.5 శాతం, బాపట్ల జిల్లాలో 39.0 శాతం లోటు వర్షపాతం నెలకుంది. జూన్‌ నెల నాలుగో వారంలోకి ప్రవేశించినా వర్షాలు అంతగా కురవలేదు. ఈ పరిస్థితుల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే దుక్కులు దున్ని సాగుకు సమాయత్తమైనా చినుకు రాలక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవటం, ప్రాజెక్టులు నిండటంతో వరి, పత్తి, మిరప తదితర పంటలను రైతులు విస్తృతంగా సాగు చేపట్టారు. మెట్ట పైర్లు చేసే పొలాలను రైతులు దుక్కులుదున్నారు. అయితే వాతావరణం సాగుకు అనుకూలించడం లేదు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు సాగితే పంటలు సాగయ్యే పరిస్థితి లేదు. సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణుడిని అన్నదాతలు వేడుకుంటున్నారు.


పల్నాడులో తీవ్ర వర్షాభావం

పల్నాడు జిల్లాలో 28 మండలాలకు రెండు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో వర్షాభావం, 15 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. పత్తి, మిరప సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేశారు. పత్తి విత్తనాలను కూడా కొనుగోలు చేశారు. భూమి పదునెక్కి వర్షం కురిస్తే పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేస్తారు. మిరప, వరి కూడా ప్రధాన పంటలు. జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. మాచర్ల ప్రాంతంలో ఇప్పటికే బోర్లు కింద 7,450 ఎకరాలలో సాగు చేశారు. ఈ జిల్లాలో 67.4 మీమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 29.10 మీమీ వర్షపాతం నమోదైంది. 56.80 శాతం లోటు వర్షపాతం నెలకొంది. 


గుంటూరు జిల్లాలో 59.50 శాతం లోటు

గుంటూరు జిల్లాలో ఇప్పటికి 81.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. 33 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 59.50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 18 మండలాలకు ఒక మండలంలో అధిక వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 5 మండలాల్లో లోటు వర్షపాతం, మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో 3.27 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా ఉంది. 50 శాతానికి పైగా అంటే 1.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. కృష్ణా డెల్టా, సాగర్‌ కుడి కాలువ నీరు జిల్లాకు సరఫరా అవుతుంది. 82,547 ఎకరాల్లో పత్తి, 53,497 ఎకరాల్లో మిరప సాగు చేస్తారు.


బాపట్ల జిల్లాలో 34.10 మిమీ వర్షపాతం 

బాపట్ల జిల్లాలో కూడా వర్షాభావం నెలకొంది. ఈ జిల్లాలో ఇప్పటికి 55.90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. 34.10 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 39 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 25 మండలాలకు ఐదు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 12 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 4 మండలాల్లో లోటు వర్షపాతం, నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నెలకుంది. ఈ జిల్లాలో 3.53 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా ఉంది. 79 శాతానికి  పైగా అంటే 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. 16,375 ఎకరాల్లో పత్తి, 24,835 ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. కృష్ణా డెల్టా, సాగర్‌ కుడి కాలువ ద్వారా సాగు నీరు జిల్లాకు సరఫరా అవుతుంది.


సాగర్‌లో ఆశాజనకంగా నిల్వలు 

నాగార్జున సాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 533.4 అడుగుల నీటి మట్టం ఉంది. 174.24 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు జూలై 15న సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకోసం జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. సాగర్‌ జలాలతో వరి సాగుకు ఇబ్బంది లేదు. అయితే పత్తి, మిరప సాగు మాత్రం వర్షాలపైనే ఆధారపడి ఉంది. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి మరి.  


 

Updated Date - 2022-06-25T05:28:07+05:30 IST