మినీ మహానాడు.. ఏర్పాట్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-05T06:15:19+05:30 IST

నరసరావుపేటలో ఈ నెల 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన తెలుగుదేశం మినీ మహానాడు ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి.

మినీ మహానాడు.. ఏర్పాట్లు ప్రారంభం
స్థలాన్ని పరిశీలిస్తున్న యరపతినేని, అరవిందబాబు, నేతలు

 నరసరావుపేటలో స్థలం ఖరారు

ఏర్పాట్లను పరిశీలించిన యరపతినేని, అరవిందబాబు


 నరసరావుపేట, అక్టోబరు4: నరసరావుపేటలో ఈ నెల 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన తెలుగుదేశం మినీ మహానాడు ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు నుంచి బైపాస్‌ రోడ్డులోని బహుళ అంతస్తుల భవనం వెనక ఉన్న రియల్‌ వెంచర్ల స్థలాన్ని మహానాడు నిర్వహణ కోసం ఖరారు చేశారు. స్ధలాన్ని చదును చేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. లక్షమంది మహానాడుకు హాజరవుతారని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేపట్టారు. మహానాడు నిర్వహణను జిల్లానేతలు ప్రతిష్టాత్మకగా తీసుకున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీశ్రేణులు, అభిమానులు హాజరయ్యేలా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాహనాలను సమకుర్చుకోనే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. నరసరావుపేటలో మహానాడు జరుగుతున్నందున్న ఈ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నేతలు నిర్ణయించారు. ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తారోనన్న అంచనాలను రూపొందించుకుంటున్నారు.  

 పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యనేతలు మహానాడుకు హాజరుకానున్నారు. మహానాడు ద్వారా రాష్ట్ర పభుత్వం వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు మహానాడును వేదికను వినియోగించుకోనున్నారు. గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మహానాడు కోసం జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై వారు స్థానిక నేతలతో సమీక్షించారు. మహానాడును విజయవంతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మహానాడు సక్సెస్‌ ద్వారా జిల్లాలో టీడీపీ సత్తా చాటుదాం అని అన్నారు. మహానాడు విజయవంతం ఏడు నియోజకవర్గాలో టీడీపీ మళ్లీ ఎగుర వేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు ఇందుకోసం సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, వేములపల్లి వెంకట నరసయ్య, పూదోట సునీల్‌, కడియం కోటి సుబ్బారావు, వాసిరెడ్డి రవి, కొట్టా కిరణ్‌కుమార్‌, కోవ్వూరి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more