కుడిఎడమలకు.. 56 ఏళ్లు

ABN , First Publish Date - 2022-08-05T05:46:19+05:30 IST

ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా.. నాగార్జునసాగర్‌ నిలుస్తుంది. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగర్‌ కాల్వలు రైతుల పాలిట కల్పతరువుగా.. అన్నదాతలకు వరప్రదాయినిగా ఉన్నాయి.

కుడిఎడమలకు.. 56 ఏళ్లు
కుడికాలువ (ఫైల్‌ఫోటో)

రైతుల పాలిట కల్పతరువుగా సాగర కాల్వలు

సాగర్‌ కాల్వలతో లక్షల ఎకరాలు సస్యశ్యామలం

కుడి కాల్వ నుంచి 11.74 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎడమ కాల్వ పరిధిలో 10.38 లక్షల ఎకరాలకు కృష్ణమ్మ 

కాల్వలను 1967 ఆగస్టు 4న జాతికి అంకితమిచ్చిన ఇందిరాగాంధీ 


విజయపురిసౌత్‌, ఆగస్టు 4: ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా.. నాగార్జునసాగర్‌ నిలుస్తుంది. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగర్‌ కాల్వలు రైతుల పాలిట కల్పతరువుగా.. అన్నదాతలకు వరప్రదాయినిగా ఉన్నాయి. బిరబిరా పరుగులు తీసే కృష్ణమ్మ నాగార్జునసాగర్‌లో నిలుస్తోంది. ఈ రిజర్వాయర్‌ 590 అడుగుల నీటిమట్టంలో 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా కృష్ణమ్మ లక్షల ఎకరాల్లో పంటలకు ఊపరి అందిస్తోంది. సాగర్‌ నిర్మాణమే ఓ అద్భుత ఘట్టంకాగా.. కుడి, ఎడమ కాల్వల నిర్మాణం మరో ఘన చరిత్రే. ఈ కాల్వలను జాతికి అంకితమిచ్చి గురువారంతో 56 ఏళ్లు అవుతుంది. కుడి కాల్వకు 1956 అక్టోబరు 10న ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేమగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న జాతికి అంకితం చేశారు. దీనిని జవహర్‌ కెనాల్‌ అని పిలుస్తారు. రిజర్వాయర్‌ నుంచి ఈ కాలువకు హెడ్‌రెగ్యులేటర్‌తో కూడిన 9 గేట్లను అమర్చారు. ఈ కాలువ ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 203 కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల వరప్రదాయినిగా వెలుగొందుతోంది. ఈ కాలువ 5342 కి.మీ పరిధిలో పారుదలవుతూ 11.74 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. ఈ కాలువ ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి ఉంది. ఫీల్డ్‌ ఛానల్స్‌ ద్వారా 14400 కి.మీ. మేర పంటలకు నీరు అందుతోంది. 

లాల్‌బహుదూర్‌ కెనాల్‌

జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదించిన మాజీ ప్రధాని జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాలా బహుదూర్‌ కెనాల్‌ అని నామకరణం చేశారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ బీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన చేయగా కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ కృష్ణమ్మ 297 కి.మీ. దూరం ప్రయాణించి 10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది. 7 బ్రాంచ్‌ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్‌ ఛానల్స్‌ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తోంది. 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణా డెల్టా ప్రాంతంలో సాగుకు ఉపయోగకరంగా ఉంది. కుడి కాలువపై 90 మెగా వాట్ల జలవిద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువపై 60 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రాలను నిర్మించారు. కుడి కాలువపై హైడల్‌ పవర్‌ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్‌ కొరతను కూడా తీరుస్తోంది. 

                   

Updated Date - 2022-08-05T05:46:19+05:30 IST