ప్రేమఘాతుకం

ABN , First Publish Date - 2022-12-07T01:20:42+05:30 IST

ప్రేమిస్తున్నట్లు నటించాడు.. అయితే ఆ ప్రేమను నిరాకరించిందని సహించలేక.. పైగా పోలీసులకు ఫిర్యాది చేసిందని నిర్దాక్షిణ్యంగా పథకం ప్రకారమే వైద్య విద్యార్థిని తపస్విని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జ్ఞానేశ్వర్‌ హతమార్చాడు.

ప్రేమఘాతుకం
జీజీహెచ్‌ మార్చురీ వద్ద విలపిస్తున్న తపస్వి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ నాటకం

నాలుగు నెలలుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వేధింపులు

ఫిర్యాదు చేసినా కౌన్సెలింగ్‌తో సరిపుచ్చిన నూజివీడు పోలీసులు

కోపం పెంచుకుని డెంటల్‌ విద్యార్థిని దారుణంగా హతమార్చిన జ్ఞానేశ్వర్‌

పరారీలో తపస్వి ేస్నహితురాలు విభ.. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

గుంటూరు(జీజీహెచ్‌), పెదకాకాని, డిసెంబరు 6: ప్రేమిస్తున్నట్లు నటించాడు.. అయితే ఆ ప్రేమను నిరాకరించిందని సహించలేక.. పైగా పోలీసులకు ఫిర్యాది చేసిందని నిర్దాక్షిణ్యంగా పథకం ప్రకారమే వైద్య విద్యార్థిని తపస్విని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జ్ఞానేశ్వర్‌ హతమార్చాడు. సోమవారం రాత్రి పెదకాకానిలో చోటుచేసుకున్న ప్రేమఘాతుకం పలువుర్ని ఆందోళనకు గురిచేసింది. నన్ను వేధిస్తున్నాడు మొర్రో అని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి బాధిత విద్యార్థి నేరుగా ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకున్న పోలీసులు

నిర్లక్ష్యానికే డెంటల్‌ విద్యార్థిని బలైందని పలువురు ఆరోపిస్తున్నారు. తపస్వి మృతదేహానికి మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. జీజీహెచ్‌లో కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా ఉంగుటూరు మండలం మణికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్‌ బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాదులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ జిల్లా పమిడిముక్కల మండలం రామాపురం గ్రామానికి చెందిన పిన్నమనేని మహేష్‌ కుమార్‌, సీతారత్నం దంపతులకు తపస్వి ద్వితీయ కుమార్తె. మహేష్‌ కుమార్‌ దంపతులు వ్యాపారరీత్యా ముంబయిలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె నిఖిత ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంది. తపస్వి(20) గన్నవరంలోని పిన్నమనేని డెంటల్‌ కాలేజీలో బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నది. రెండేళ్ల క్రితం జ్ఞానేశ్వర్‌తో తపస్వికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తపస్వి దగ్గర నుంచి పలుమార్లు బంగారు ఉంగరాలు, కొంతమేరకు నగదును జ్ఞానేశ్వర్‌ తీసుకున్నాడు. అయితే వీరి స్నేహంలో నాలుగు నెలల క్రితం మనస్పర్థలు వచ్చాయి. జ్ఞానేశ్వర్‌ వేధింపులను తట్టుకోలేక తపస్వి బరు 12న నూజివీడు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. ప్రేమించమని వెంటపడుతూ, వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడి భారీ నుంచి కాపాడాలని ఫిర్యాదులో తపస్వి కోరింది. అయితే నూజివీడు పోలీసులు మాత్రం ఈ కేసును ఆషామాషీగా తీసుకుని అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయితే తపస్వికాని, పోలీసులుకాని, తపస్వి తల్లిదండ్రులకు జ్ఞానేశ్వర్‌ వేధింపులపై కనీస సమాచారం ఇవ్వలేదు. దీంతో జ్ఞానేశ్వర్‌ వేధింపులు మరీ ఎక్కువ చేశాడు. దీంతో తపస్విపై మరింత కోపం పెంచుకున్న జ్ఞానేశ్వర్‌ పథకం ప్రకారం హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం తపస్వి అతడి నుంచి రక్షణ కోసంగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని ేస్నహితురాలు విభ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందుతుంది. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కరించుకుందామని భావించిన తపస్వి విభ ద్వారా అతడికి కబురు చేసి మాట్లాడుకుందామని చెప్పింది. సరే అని సోమవారం రాత్రి తక్కెళ్లపాడు వచ్చిన జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతుండగానే తనతో తెచ్చుకున్న సర్జికల్‌ బ్లేడుతో తపస్విపై దాడి చేసి విచక్షణా రహితంగా పీక కోసి హతమర్చాడు. రాత్రి సంఘటన జరిగిన వెంటనే జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. జ్ఞానేశ్వర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన విభ ప్రస్తుతం పరారీలో ఉంది.

విషయం తెలియదు: తల్లి

హత్య రాత్రి 8.50 నిమిషాలకు జరగ్గా 8.25 నిమిషాలకు తపస్వి తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. అప్పుడు కూడా తమకు ఈ విషయం చెప్పలేదని తల్లి వాపోయింది. పోలీసులు ఈ విషయంపై లోతుగా విచారించి గట్టి చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని, ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు : వాసిరెడ్డి పద్మ

జీజీహెచ్‌ మార్చురి వద్ద తపస్వి తల్లిదండ్రులను మంగళవారం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలిసి మాట్లాడుకుందాం అనుకున్న వారిపైనే కత్తులు దూయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే ఇటువంటి చర్యలకు ముగింపు ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదన్నారు. తల్లిదండ్రులు పిల్లలపట్ల బాధ్యతగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా ప్రేమలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. నూజివీడు పోలీసుల ప్రవర్తనపై పూర్తి స్థాయి నివేదిక కోరామన్నారు. వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. దిశ చట్టం రూపకల్పనకు శిక్షలు త్వరగా అమలు చేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ఉందన్నారు.

Updated Date - 2022-12-07T01:20:52+05:30 IST