మళ్లీ మనోళ్లకే చిక్కీ!

ABN , First Publish Date - 2022-12-13T02:46:20+05:30 IST

బడి పిల్లలకు ఇచ్చే చిక్కీ వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది.

మళ్లీ మనోళ్లకే చిక్కీ!

నెల మొదలైతే ఉద్యోగుల్లో వేతనాల టెన్షన్‌ ఆరంభం! ఈనెల వారం దాటినా ఇంకా పెన్షన్లు పడకపోవడంతో కొన్నిజిల్లాల్లో పింఛనుదారులు రోడ్డెక్కారు. డబ్బులు లేవని, అప్పు పుడితేనే వేతనాలు, పెన్షన్లు వేస్తామని జగన్‌ సర్కారు ప్రతిసారీ తేల్చేస్తోంది. కానీ, పిల్లలకు పెట్టే చిక్కీల కాంట్రాక్టు విషయంలో మాత్రం ఉదారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది వేరుశెనగ పంట దిగుబడి బాగుంది. కొత్త టెండర్లకు వెళితే చిక్కీల ధర తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వంపై భారంకూడా తగ్గే వీలుంది. అయినా, ఈ నెల చివరితో గడువు ముగుస్తున్నా.. ప్రస్తుత ధరలకే పాత టెండర్లను పొడిగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చిక్కీల సరఫరా సక్రమంగా జరగడం లేదని విమర్శలుఉన్నా, వారినే కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రస్తుత కాంట్రాక్టర్లనే కొనసాగించే ప్రయత్నం

130 కోట్ల టెండరులో అడ్డగోలు వ్యవహారం

తగ్గిన వేరుశెనగ ధరలతో భారమూ తగ్గే వీలు

కానీ, పాతవారినే పొడిగించేలా ఓ నేత ఒత్తిడి!

సూపరింటెండెంట్‌ స్థాయిలో సహకారం

అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బడి పిల్లలకు ఇచ్చే చిక్కీ వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత టెండరు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా, ప్రస్తుత కాంట్రాక్టర్లనే మరో ఏడాది పొడిగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులోభాగంగానే గడువు చివరికి వచ్చినా ఇంతవరకూ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మధ్యాహ్న భోజన పథక విభాగం కొత్త టెండరును పిలవలేదు. సాధారణంగా టెండర్ల ఖరారుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. డిసెంబరుతో ప్రస్తుత కాంట్రాక్టర్ల గడువు ముగుస్తున్నందున ఈపాటికే టెండర్లు పిలిచి, ప్రక్రియ మొదలుపెట్టాలి. కానీ ఇంతవరకూ ఆ ఊసే లేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని వైసీపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో అమలుచేస్తోంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారానికి మూడు చొప్పున చిక్కీలు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకూ రెండుసార్లు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా చిక్కీలు పాఠశాలలకు సరఫరా చేస్తోంది. గతేడాది పిలిచిన టెండర్లలో ఆరుగురు కాంట్రాక్టర్లకు టెండరు దక్కింది. జిల్లాలవారీగా పాఠశాలలను విభజించి సరఫరా చేస్తున్నారు.

టెండరు గడువు గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది డిసెంబరు వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి మళ్లీ సరఫరాదారులను ఎంపిక చేయాలి. 2019-20 విద్యా సంవత్సరం నాటి లెక్కల ప్రకారం 45,686 ప్రభుత్వ పాఠశాలల్లో 36,61,284 మంది విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేసేలా ఈ కాంట్రాక్టు కుదిరింది. ఒక విద్యా సంవత్సరంలో 40.27కోట్ల చిక్కీలు సేకరించాల్సి ఉంది. దీని విలువ సుమారు రూ.136 కోట్లు. ఇంత పెద్ద టెండరును ఎలాంటి కారణాలు లేకుండానే పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ప్రస్తుత కాంట్రాక్టర్ల ఒత్తిడి, కొందరు అధికారుల సహకారంతో ఈ మేరకు పొడిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గతేడాది టెండర్లు పిలిచిన సమయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు సంస్థల్లో కేవలం రెండు సంస్థలకు మాత్రమే టెండరు విధివిధానాల ప్రకారం అర్హతలున్నాయి. నాలుగు సంస్థలకు అర్హతలు లేకపోయినా కట్టబెట్టారు. చిక్కీల సరఫరా సక్రమంగా జరగడం లేదని విమర్శలు ఉన్నా, వాటిని పట్టించుకోవడం లేదు. అలాగే ఈ ఏడాది వేరుశెనగ పంట దిగుబడి బాగున్నందున టెండర్లకు వెళ్తే ధర తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రస్తుత ధరలకే పొడిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ నేత జోక్యం...

ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత ఆదేశాల మేరకే టెండర్లు పొడిగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పేరుకు ఆరుసంస్థలు ఉన్నా, ఉత్తరాంధ్రకు చెందిన రెండు సంస్థలే రాష్ట్రం మొత్తం చక్రం తిప్పుతున్నాయి. ఆ రెండు కంపెనీలకు మేలు చేసేందుకు సదరు నేత రంగంలోకి దిగి, పొడిగింపునకు ఫైలు తయారుచేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథక కార్యాలయంలోని ఓ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి ఈ వ్యవహారానికి తన సహకారం అందిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పొడిగింపు అనేది నిబంధనలకు విరుద్ధం. అయినా, దాన్ని ఎలా బుల్డోజ్‌ చేయాలనే దానిపై ఆయన సూచనలు చేస్తున్నారని అంటున్నాయి.

న్యాయ సమీక్ష ఏదీ?

టెండర్ల ఖరారులో న్యాయ సమీక్ష అనే విధానాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.వంద కోట్లు దాటే టెండర్లన్నీ దీని పరిధిలోకి వస్తాయని, పారదర్శకత ఉంటుందని ప్రచారం చేసుకుంది. అందుకు అనుగుణంగానే చిక్కీల టెండర్‌ను 2019-20లో న్యాయ సమీక్షకు పంపారు. న్యాయ సమీక్షకు వెళ్తే అడ్డగోలు వ్యవహారాలు సాగవని భావించి అనంతరం దాన్ని ప్యాకేజీలుగా విడగొట్టారు. ఏకంగా ఆరు ప్యాకేజీలు చేయడంతో గత రెండేళ్లు అసలు న్యాయ సమీక్షకు వెళ్లలేదు. పేరుకు న్యాయసమీక్ష అంటూ ప్రచారం చేసుకుని, ఇప్పుడు దాని పరిధిలోకి రాకుండా కాంట్రాక్టును ముక్కలు ముక్కలుగా విడగొట్టడంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.

కమిటీ నిర్ణయం తీసుకుంటుంది

టెండర్లపై మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ నిధి మీనాను వివరణ కోరగా... ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ సమావేశం త్వరలో జరగుతుందని, అందులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుత కాంట్రాక్టును పొడిగించే అంశంపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఒకవేళ కమిటీ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించినా అందుకు సమయం సరిపోదు. దీంతో కొంతకాలమైనా ప్రస్తుత కాంట్రాక్టర్లకే ఇవ్వక తప్పదు.

- నిధి మీనా, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌

Updated Date - 2022-12-13T02:46:20+05:30 IST

Read more