వీడని వర్షం.. తీరని నష్టం...

ABN , First Publish Date - 2022-12-13T01:22:44+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షంతో వరి ఓదెలు మొత్తం నీటిలో మునిగిపోయాయి.

వీడని వర్షం.. తీరని నష్టం...
నానుతున్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌

బాపట్ల, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షంతో వరి ఓదెలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. నీటిపై తేలియాడుతున్న వరి ఓదెలను కంకులు పైకిపెట్టి కట్టలు కట్టి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బీపీటీ ధాన్యం మొలక వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ సోమవారం అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించారు. పొలాలకు వెళ్ళి నీటమునిగిన పంటను పరిశీలించి జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టం వివరాలు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రైతులకు నష్టం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఆర్డీవో గంధం రవీందర్‌, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్‌ సత్తార్‌, మండల వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన...

మాండస్‌ వల్ల రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రత్యక్షంగా చూడడానికి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఆమె పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అదే విధంగా పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలం గ్రామంలో దెబ్బతిన్న పంటల నష్టాన్ని తెలుసుకున్నారు. చెరుకుపల్లి మండలం కావూరు గ్రామ జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి తూకాలు, అమ్మకం తదితర వివరాలను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు.

కర్లపాలెం మండలలో...

కర్లపాలెం: మండలంలోని పలు పంచాయతీలలో మాండస్‌ తుఫాన్‌ కారణంగా గాలులకు వరిపైరు నేలవాలటం కురిసిన వర్షానికి కోసిన వరిపైరు ముంపునకు గురై మండల రైతాంగం విలవిలలాడిపోతున్నారు. మండలంలో కొత్తనందాయపాలెంలో ముంపునకు గురైన మిరప పైర్లను కాపాడుకునేందుకు రైతులు ప్రొక్లెయిన్ల ద్వారా పొలాలలోని నీటిని బయటకు తరలించేందుకు బోదె (కాల్వ)ను ఏర్పాటుచేశారు.

పంట నష్టపరిహారం నమోదు చేయండి: కలెక్టర్‌

కర్లపాలెం, డిసెంబరు 12: కర్లపాలెం మండలంలో మాండ్‌సతుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేయమనికర్లపాలెం తహసీల్దార్‌ కేశవ నారాయణను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. మండలంలోని బుద్దాం గ్రామంలో తుఫాన్‌ కారణంగా ముంపునకు గురైన వరి పనలను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి విజయకృష్ణన్‌ సోమవారం సందర్శించారు. కోసిన వరిపైరు ధాన్యం పాడైపోకుండా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ సిబ్బంది తక్షణమే రైతాంగానికి తెలియపర్చాలని జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్‌ సత్తార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్గీవో గంధం రవీందర్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ లక్ష్మి, వ్యవసాయాధికారి సుమంత్‌కుమార్‌, తహసీల్దార్‌ కేశవనారాయణ, కార్యదర్శి పద్మావతి, సచివాలయ సిబ్బంది పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పిట్టలవానిపాలెం మండలంలో...

పిట్టలవానిపాలెం, డిసెంబరు 12: వరి పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు మండల పరిధిలోని పిట్టువారిపాలెంలో మాండస్‌ తుఫాన్‌ కారణంగా వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లావ్యవసాయశాఖాధికారి అబ్దుల్‌ సత్తార్‌, మండల వ్యవసాయశాఖాధికారి సీహెచ్‌.సత్యానంద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ జి.శ్రీచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:22:48+05:30 IST