మాండస్‌.. గజగజ

ABN , First Publish Date - 2022-12-10T01:29:16+05:30 IST

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారింది

మాండస్‌.. గజగజ
భట్టిప్రోలు శివారులో చాపలా నేలవాలిన వరి పంట

మధ్యాహ్నం నుంచి వాన జల్లులు

వరి కోతలకు అడ్డంకిగా వాతావరణం

చేతికందే పంట నష్టపోతామని రైతుల కన్నీరు

ఈదురుగాలులతో అంతటా పడిపోయిన ఉష్ణోగ్రతలు

గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 27.25 మిమీ వర్షపాతం

గుంటూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారింది తుఫాను ప్రభావం శుక్రవారం వేకువజాము నుంచే జిల్లాలో కనిపించడం ప్రారంభించింది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. మాండస్‌ హెచ్చరికలకు తోడు శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. మబ్బులు కమ్ముకు వచ్చి చినుకులతో ప్రారంభమై సాయంత్రానికి వర్షపుజల్లులు మొదలయ్యాయి. గాలుల కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలుతుంది. మరోవైపు వాతావరణంలో మార్పులతో కోతలకు ఆటంకంగా మారింది. శనివారం తుఫాన్‌ తీరం దాటే నేపథ్యంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వరి పంట చేతికి అందివచ్చే తరుణంలో తుఫాన్‌ హెచ్చరికలు రైతుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో కోత కోసిన వరి పంట ఓదెల రూపంలో పొలాల్లోనే ఉంది. తెనాలి ప్రాంతంలో సుమారుగా 8 - 10 శాతం కోతలు మాత్రమే పూర్తి కాగా 90 శాతం పంటలు కోత దశలోనే ఉన్నాయి. తుఫాను ప్రభావంతో శుకవ్రారం సాయంత్రం నుంచి ఆగి ఆగి జల్లులు కురుస్తున్నాయి. గాలులతో కూడిన వర్షం కురిస్తే తమ పంటలు నేలవాలి వర్షపు నీటితో నీటమునిగితే తమకు అపారనష్టాన్ని మిగులుస్తాయని అన్నదాతలు విలవిలలాడుతున్నారు. కొల్లిపరలో మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పడటంతో రైతులు పంటను కాపాడుకోవటానికి పొలలవైపు పరుగులు తీశారు. దుగ్గిరాల ప్రాంతంలో వేలాది ఎకరాలో పంట కోయాల్సి ఉంది. వర్షం ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనతో అన్నదాత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే చలికాలం కావడం, దానికి ఈదురుగాలులు తోడు కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పలుచోట్ల 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 27.25 మిల్లీమీటర్ల వర్షపాతం రాత్రి 7 గంటల సమయానికి రికార్డు అయింది. పిడుగురాళ్లలో 31.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరి, తాడేపల్లి, ఫిరంగిపురం, కాకుమాను, తాడికొండ, పొన్నూరు, దుగ్గిరాల, కొల్లిపర, తుళ్లూరు, తెనాలి, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల్లోనూ వర్షం కురిసింది.9పిఎన్‌ఆర్‌టౌన్‌2:చంద్రబాబును కలిసేందుకు విచ్చేసిన గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజా ప్రతినిధులు

- తుఫాన్‌ నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ చేశారు. కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 8712655881కు ఫోన్‌ చేయాలని ఆమె తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కోరారు. అధికారులు ముందస్తు చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.

Updated Date - 2022-12-10T01:29:22+05:30 IST