పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-25T04:59:52+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ మద్ది లక్ష్మయ్య(93) బుధవారం ఇక్కడ కన్నుమూశారు

పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య కన్నుమూత
మద్ది లక్ష్మయ్య

చిలకలూరిపేట, ఆగస్టు 24: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ మద్ది లక్ష్మయ్య(93) బుధవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించిన ఆయన నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణ సమయంలో ఆయన ఇంజనీరుగా సేవలను అందించారు. అనంతరం పొగాకు వ్యాపారంలోకి వచ్చారు. మద్ది లక్ష్మయ్య కంపెనీ ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలకు పొగాకు ఎగుమతులు చేస్తూ మంచి పేరు సంపాదించారు. 2004 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ తదితరులు పట్టణంలోని మద్ది లక్ష్మయ్య గృహానికి వెళ్ళి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో సీఆర్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు చెరుకూరి కాంతయ్య, కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, అసిస్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జాస్తి రంగారావు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ తేళ్ళ సుబ్బారావు, టీడీపీ సీనియర్‌ నాయకులు మానం వెంకటేశ్వర్లు, నెల్లూరి సదాశివరావు, షేక్‌ కరిముల్లా, నాతాని ఉమా మహేశ్వరరావు,  పార్టీకి చెందిన పలువురు నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు. 


Updated Date - 2022-08-25T04:59:52+05:30 IST