జూలకంటితో.. జోష్
ABN , First Publish Date - 2022-09-08T04:52:25+05:30 IST
తెలుగుదేశం పరిస్థితి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మెరుగ్గా ఉంది
మాచర్లలో టీడీపీకి పూర్వవైభవం
నియోజకవర్గంలో ఒకే తాటిపైకి క్యాడర్
ఇన్‌చార్జిగా బ్రహ్మారెడ్డి రాకతో తమ్ముళ్లలో ధైర్యం
అధికార పార్టీ అరాచకాలను అడ్డుకుంటోన్న వైనం
కేసులు పెడుతున్నా వెనక్కితగ్గకుండా శ్రేణులకు భరోసా
నరసరావుపేట, సెప్టెంబరు 7: తెలుగుదేశం పరిస్థితి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మెరుగ్గా ఉంది. అసమ్మతి, నేతల మధ్య అనైక్యత వంటి సమస్యలు ఇతర నియోజకవర్గాల్లో ఉన్నా అవేవి మాచర్లలో కన్పించడంలేదు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ కుమారుడు, సీనియర్ నేత బ్రహ్మారెడ్డిని తొమ్మిది నెలల క్రితం అధిష్ఠానం నియమించింది. బ్రహ్మారెడ్డి బాధ్యతలు తీసుకున్న ప్రారంభంలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట నడిచేందుకు సహాసం చేయలేదు. అయినా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి నిర్వహించే కార్యక్రమాలను పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చింది. ఆయన రాకతో మాచర్ల టీడీపీలో జోష్ నెలకొంది. పార్టీలో పూర్వవైభవం నెలకుంటోంది. అధికార పార్టీ అరాచకాలకు ఆయన ఎదురొడ్డి నిలబడి శ్రేణులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అధిష్ఠానం బ్రహ్మారెడ్డికి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తేనే ఆయన ఇంకా పార్టీని ముందుకు తీసుకువెళ్ళగలరని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాచర్లను ఆదర్శంగా తీసుకుని జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని నేతలు సూచిస్తున్నారు.
ఢీ అంటే ఢీ
నియోజకవర్గంలో కార్యకర్తలకు నేనున్నా అనే భరోసా కల్పిస్తూ బ్రహ్మారెడ్డి దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఆగడాలను పెంచిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. చివరకు వినాయక చవితి ఉత్సవాలను కూడా రాజకీయం చేసిందని విమర్శిస్తున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా అనేక అక్రమ కేసులు బనాయించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరాచకాలతో జూలకంటిని నియోజకవర్గం నుంచి పంపించాలనే రీతిలో అధికార పార్టీ పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నదంటున్నారు. బ్రహ్మారెడ్డి మాచర్లలో పార్టీని బలోపేతం చేస్తుండటాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేక పోతున్నది. ఇప్పటికే పార్టీ నేతలను హతమార్చడం, వారిపై ప్రత్యక్ష దాడులు చేస్తుండటం ద్వారా టీడీపీని బలహీన పర్చాలన్న అధికార పార్టీ వ్యూహాన్ని బ్రహ్మారెడ్డి బలంగానే తిప్పికొడుతున్నారు. ఢీ అంటే ఢీ అన్న రితీలో జూలకంటి వ్యవహరిస్తుండటం పార్టీ క్యాడర్‌లో ధైర్యన్ని నింపుతోంది. పార్టీ శ్రేణులు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారు. అధికార పార్టీ చర్యలను ఎండగట్టడంలో జిల్లాలోనే మాచర్ల ముందుంది. ఈ స్థాయికి పార్టీని తీసుకురావడంలో బ్రహ్మారెడ్డి విశేషంగానే కృషి చేశారని చెప్పవచ్చు.
భయం నుంచి భయటకు..
మాచర్ల నియోజకవర్గంలో వరుసగా నాలుగు పర్యాయాల నుంచి టీడీపీ ఓటమిని చవిచూస్తున్నది. ప్రతి సారి అధిష్ఠానం ఇక్కడ ప్రయోగాలు చేస్తూ అభ్యర్థులను బరిలో దింపుతుంది. అయినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ దాడులకు తెగబడింది. పార్టీ క్యాడర్ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే సాహసించని పరిస్థితిలో ఇక్కడ నెలకొంది. అధికార పార్టీ ఆగడాలను తట్టుకోలేక నాయకులతో పాటు కార్యకర్తలు సైతం గ్రామాలను వదిలి వెళ్లిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భయాందోళనల నుంచి ఇప్పుడిప్పుడే నాయకులు, కార్యకర్తలు బయటకు వస్తున్నారు.