పల్నాడులో పార్టీకి పూర్వ వైభవం
ABN , First Publish Date - 2022-05-18T05:29:44+05:30 IST
పల్నాడులో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉండటంతోపాటు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోందని మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

లోకేశ్‌కు వివరించిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల, మే17: పల్నాడులో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉండటంతోపాటు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోందని మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు యరపతినేని వివరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో లోకేశ్‌ను ఆయన కలిశారు. ఓటర్లు టీడీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జ్గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక అక్కడి పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం వచ్చిందని, పార్టీకి పూర్వవైభవం రానుందన్నారు. అదే విధంగా గురజాల నియోజకవర్గంలో తాను చేపట్టిన పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందన్నారు. జూలై ఆఖరు లోపు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.