ఆదేశాలిస్తాం... అమలు చేయం..!

ABN , First Publish Date - 2022-12-15T03:44:25+05:30 IST

దేవదాయ శాఖలో ఎప్పుడు ఏ ఉత్తర్వులు ఇస్తారో, అందులో ఎన్ని అమలు చేస్తారో ఆ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది.

ఆదేశాలిస్తాం... అమలు చేయం..!

దేవదాయ శాఖలో 24 సెక్షన్ల విధులు ఏడీసీలకు

ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్‌

అయినా ఇప్పటి వరకూ అమల్లోకి రాని ఆర్డర్‌

దానికి వ్యతిరేకంగా కీలక అధికారి వ్యవహారం

ఇప్పటికే ఏడీసీల విధుల్లో జోక్యంపై విమర్శలు

దేవాలయాల్లో తనిఖీల్లేకపోవడంతో అక్రమాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో ఎప్పుడు ఏ ఉత్తర్వులు ఇస్తారో, అందులో ఎన్ని అమలు చేస్తారో ఆ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. దేవదాయ శాఖ యాక్ట్‌లో 163 సెక్షన్లు ఉండగా అందులో 24 సెక్షన్లకు సంబంధించిన అధికారాలను అడిషనల్‌ కమిషనర్‌(ఏడీసీ)లకు బదలాయిస్తూ ఈ నెల 7న కమిషనర్‌ కీలకమైన ఆర్డర్‌ ఇచ్చారు. ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు, లీజులు, లైసెన్సులు, బడ్జెట్‌ ఆమోదం వంటి వ్యవహారాలన్నింటినీ వారికి అప్పగించారు. ఈ శాఖలో ఇద్దరు ఏడీసీలున్నారు. మల్టీ జోన్‌-1లోని జిల్లాల బాధ్యత ఏడీసీ-1కు, మల్టీజోన్‌-2లోని జిల్లాల బాధ్యత ఏడీసీ-2కి అప్పగించారు. అయితే ఈ ఆర్డర్‌ నేటివరకూ అమలులోకి రాలేదు. అసలు కమిషనర్‌ ఇచ్చిన ఆర్డర్‌ను ఆయనే పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నటి వరకూ ఏడీసీలను డమ్మీలను చేసిన ఓ అధికారి శాఖలో చక్రం తిప్పేవారు. అన్ని దేవాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఏడీసీల విధులను సైతం ఆయనే నిర్వహించేవారు. దీంతో దేవదాయ శాఖ యాక్ట్‌లోని సెక్షన్‌-8 ఆధారంగా 2009లో అప్పటి ఆ శాఖ కార్యదర్శి వీరభద్రయ్య ఇచ్చిన జీవో 1453ని అధికారులు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ జీవో అమలులోకి వచ్చింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం దాని అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రధాన కార్యాలయంలో ఏడీసీల విధులను మరో అధికారి నిర్వహించేవారు. దీన్ని అడ్డంపెట్టుకుని సదరు అధికారి భారీ ఎత్తున దండుకుంటున్నారు. దీనికి బ్రేక్‌ వేసేందుకు అధికారులు జీవో 1453ని కమిషనర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన జీవో అమలుకు ప్రత్యేక ఆర్డర్‌ ఇచ్చారు. కానీ అది ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. గతంలో మాదిరిగానే ఏడీసీలకు సంబంధం లేకుండా ఫైళ్లు మొత్తం సదరు అధికారి నుంచి నేరుగా కమిషనర్‌కు వెళ్లిపోతున్నాయి. మరోవైపు కమిషనర్‌ ఆర్డర్‌ ఇచ్చిన తర్వాతే దేవాలయాల తనిఖీలు నిర్వహిస్తుండటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈమాత్రం దానికి ఆర్డర్‌ ఇవ్వడమెందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్డర్‌కు వ్యతిరేకంగా విధులు నిర్వహించే అధికారులను మందలించాల్సిన కమిషనర్‌... వారిని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రెండేళ్ల నుంచి తనిఖీలు నిల్‌

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దేవాలయాలున్నాయి. వీటిలో సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగ్రంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను ప్రధానమైనవిగా పరిగణిస్తారు. వీటికి ఈవోలుగా జాయింట్‌ కమిషనర్లు ఉంటారు. ఇవికాకుండా మరో 208 వరకూ 6ఏ దేవాలయాలు, 1,400 వరకూ 6బీ, 22వేల వరకూ 6సీ దేవాలయాలతో పాటు మరికొన్ని చిన్న ఆలయాలున్నాయి. కేటగిరీతో సంబంధం లేకుండా ఏటా అన్ని ఆలయాల్లోనూ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. 6సీ ఆలయాల్లో అసిస్టెంట్‌ కమిషనర్లు, 6బీ ఆలయాల్లో డిప్యూటీ కమిషనర్లు, 6ఏ ఆలయాల్లో రూ.కోటి లోపు ఆదాయం ఉంటే ఆర్జేసీలు, ఆదాయం కోటి దాటితే ఏడీసీలు నేరుగా వెళ్లి తనిఖీలు చేయాలి. అయితే గత రెండేళ్లలో పూర్తిస్థాయి తనిఖీలు చేయకపోవడంతో కొన్ని ఆలయాల్లో ఆర్థిక అవకతవకలు, లీజులు, లైసెన్స్‌ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు 6ఏ దేవాలయాలకు వెళ్లి తనిఖీలు చేయకుండా, ప్రధాన కార్యాలయానికి ఈవోలను పిలుపించుకుని తూతూమంత్రంగా పనికానిస్తున్నారు. ముడుపులిస్తే చాలు... అంతా సక్రమంగా ఉందని సర్టిఫై చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నెల 7న కమిషనర్‌ ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం ఆలయాల్లో తనిఖీలు జరిగి, అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఉద్యోగులు ఆశించినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు ఇచ్చిన ఆర్డర్‌ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఆర్డర్లు అమలు చేస్తున్నాం

దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనరే అన్ని విధులు నిర్వహించాలంటే కష్టంగా ఉంటుంది. యాక్ట్‌ ప్రకారం కొన్ని సెక్షన్ల విధులను ఏడీసీలకు అప్పగించాం. వాటిని ఇప్పటికే అమలు చేస్తున్నాం. చిన్న లైసెన్సులు, లీజుల అంశాలపై కూడా కమిషనర్‌కే ఫైళ్లు పెడుతున్నారు. ఇకపై అవన్నీ ఏడీసీల స్థాయిలోనే ఆమోదం తెలిపే విధంగా ఆర్డర్లు ఇచ్చాం.

- హరి జవహర్‌లాల్‌, దేవదాయశాఖ కమిషనర్‌

Updated Date - 2022-12-15T03:44:26+05:30 IST