కార్మికుల.. సంక్షోభం

ABN , First Publish Date - 2022-11-19T00:45:32+05:30 IST

రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగించే కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం చూడాల్సిన కార్మిక శాఖ వారికి కనీసమాత్రంగా కూడా భరోసా ఇవ్వలేకపోతోంది.

కార్మికుల.. సంక్షోభం

కార్మికుల జీవనం.. జీవితం కష్టాల మయంగా మారుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. అనారోగ్యం.. అనుకోని దుర్ఘటన జరిగినా ఇక వారి పరిస్థితి.. వారి కుటుంబ పరిస్థితి దయనీయమే. గతంలో పనులు పుష్కలంగా ఉండేవి.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా అనంతరం పరిస్థితి దారుణంగా మారింది. ఇక ప్రభుత్వ విధానాలు కూడా కార్మికుల ఉపాధికి గండికొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిల్లోని కార్మికుల్లో సగానికిపైగా కార్మికులు భవన నిర్మాణం రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే పెరిగిన ధరలు.. ఇసుకతో నిర్మాణరంగం కుదేలవడంతో కార్మికులకు ఉపాధి గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వం వారి రెక్కల కష్టాన్నే దోచుకోవడంపై దృష్టి సారిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కించాలని కార్మికులు గగ్గోలు పెడుతున్నా ఆలకించేవారే లేకుండా పోయారు.

గుంటూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగించే కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం చూడాల్సిన కార్మిక శాఖ వారికి కనీసమాత్రంగా కూడా భరోసా ఇవ్వలేకపోతోంది. పని ప్రదేశంలో, నిత్య జీవితంలో కార్మికులు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థకు చేరింది. కార్మికుల న్యాయమైన కోర్కెలు, డిమాండ్లను కూడా పరిష్కరించలేనంతగా కార్మిక శాఖ నిర్వీర్యమైపోతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మూడున్నరేళ్లుగా పనులు లేక, బతుకుదెరువు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులోకి తెచ్చిన నూతన ఇసుక విధానం వీరి పొట్టగొట్టింది. ఫలితంగా ఇసుక కొరత, ఆకాశాన్నంటిన ఇసుక ధరలతో నిర్మాణాల వేగం తగ్గింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. 2019 చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చింది. దీంతో నిర్మాణాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా లక్షలాదిమంది పనులు కోల్పోయారు. ఆ వెంటనే వచ్చిన కరోనా కార్మికులను కోలుకోలేనంతగా దెబ్బతీసింది. మూడు దశల్లో వచ్చిన కరోనా కారణంగా కార్మికులు 2022 వరకూ పనులు కోల్పోయారు. సమాజం కరోనా కష్టాల నుంచి బయట పడినప్పటికీ నిర్మాణ కార్మికులను వీడలేదు. నిర్మాణాలకు అవసరమయ్యే ఇనుము, సిమెంటు, ఇసుక, కలప, రంగుల ధరలు ఆకాశాన్నంటడంతో జిల్లాలో ఎవరూ కొత్తగా నిర్మాణాల జోలికి పోలేదు. దీంతో గడిచిన మూడున్నరేళ్లుగా కార్మికులు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

తండ్రి పథకాన్ని నీరుగార్చిన తనయుడు

నిర్మాణరంగ కార్మికుల ఒత్తిడితో 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షే బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా కార్మికుల దినసరి కూలీల్లోంచి కొంత మొత్తం తీసుకుని సంక్షేమ బోర్డులో జమ చేస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 6 లక్షల మంది కార్మికులు దాదాపు 90 కోట్ల రూపాయలు ఈ బోర్డులో తమ కష్టార్జితాన్ని జమ చేశారు. కాగా రాజశేఖర్‌రెడ్డి కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది. పదిహేనేళ్లుగా కార్మికులు తమ కష్టార్జితం నుంచి జమ చేసిన నిధులను మళ్లించింది. ఫలితంగా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి.

మూడున్నరేళ్లుగా క్రెయిమ్‌ల పెండింగ్‌

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గడిచిన మూడున్నరేళ్లుగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన క్లెయిమ్‌లు పెండింగులో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పరిష్కరించి కార్మికులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వాటిని పరిష్కరించకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 9 వేల క్లెయిమ్‌లు పెండింగులో ఉన్నాయి. వీటి తాలూకు కార్మికులకు రూ.15 కోట్ల రూపాయలు పరిహారం అందాల్సి ఉంది. కానీ ఒక్కరికి కూడా పరిహారం అందలేదు. కాగా ప్రతి ఏటా కార్మికుల నుంచి రూ.12 చొప్పున అధికారులు ప్రీమియంను వసూలు చేయడం విశేషం. కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్న డిమాండ్‌ పెద్దఎత్తున వచ్చింది. ఒత్తిడి తీవ్రం కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కరోనా సాయం అందించాలని కేంద్రం సూచించింది. ఆ మేరకు కేరళ, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కార్మికులకు రూ.5 వేల చొప్పున పరిహారం అందించాయి. రాష్ట్రంలో కూడా కార్మికులు తమ సంక్షేమ నిధి నుంచి సాయం చేయాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కార్మికులకు కరోనా సాయం చేయలేదు.

Updated Date - 2022-11-19T00:45:37+05:30 IST