బిరబిరా.. కృష్ణమ్మ

ABN , First Publish Date - 2022-08-12T05:58:40+05:30 IST

బిర బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్‌ బంధనాల నుంచి విముక్తి పొంది సాగరం దిశగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

బిరబిరా.. కృష్ణమ్మ
26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

సాగర్‌ నుంచి సాగరానికి

పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవాహం

సాగర్‌ నుంచి 26 గేట్ల ద్వారా నీటి విడుదల

నదిలో గంటగంటకు పెరుగుతోన్న వరద ఉధృతి

నేడు ప్రకాశం బ్యారేజి నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల 

తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

గుంటూరు కలెక్టరేట్‌లో 0863 2234014 నెంబర్‌తో కంట్రోల్‌ రూం ఏర్పాటు


విజయపురిసౌత్‌, ఆగస్టు 11: బిర బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్‌ బంధనాల నుంచి విముక్తి పొంది సాగరం దిశగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరదలు భారీ స్థాయిలో పోటెత్తడంతో కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి ఆంధ్రలోని సాగర్‌ జలాశయం వరకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ జలాశయం నీటి మట్టం గరిష్ఠ స్థాయికి  చేరుకుంది. గరిష్ఠ స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా గురువారం ఉదయం 5 గంటలకే జలాశయంలో నీటి మట్టం 588.00 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం సాగర్‌ 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఎత్తి 3,80,016 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే మీదగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ఎగువున ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి పది క్రస్ట్‌ గేట్లు, కుడి, ఎడమ కాల్వలు, విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాల ద్వారా మొత్తం 4,37,670 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. దిండి, ఇతర చిన్న వాగుల నుంచి సాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో సాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లను చీఫ్‌ ఇంజనీరు శ్రీకాంత్‌రావు, డ్యాం ఎస్‌ఈ ధర్మలు స్విచ్చాన్‌ చేసి పది క్రస్ట్‌గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి వరద తీవ్రత భారీగా ఉండడంతో 26 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, ఎడమ కాల్వ ద్వారా 4547, కుడి కాల్వ ద్వారా 5292, వరద కాల్వ ద్వారా 300, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,806 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 3,80,016 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫో 4,22,761 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 4,34,860 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులుంది.  జూరాల నుంచి శ్రీశైలానికి 2,21,559, రోజా నుంచి 1,76,359, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 3,97,918 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 2009 తర్వాత నాగార్జున సాగర్‌ 26 క్రస్ట్‌గేట్లను ఒకేసారి మొదటిరోజు ఎత్తడం ఇదే ప్రథమం. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలన్నీ మొదటి దఫాలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. సాగర్‌ నుంచి నీటి విడుదలతో దాచేపల్లి మండలం రామాపురంలో నది ఒడ్డున నివాసం ఉంటున్న 60కిపైగా పల్లెకారుల కుటుంబాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తరలించారు. 


పులిచింతల నుంచి.. 

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రం 17 గేట్లు పైకెత్తి  4,42,525 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 33.53 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 17 గేట్ల ద్వారా 4,36,525 క్యూసెక్కుల నీరు దిగువ కృష్ణకు విడుదల అవుతుంది. పవర్‌ జనరేషన్‌ ద్వారా ఆరు వేల క్యూసెక్కుల  నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 3,44,748 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. సాగర్‌ నుంచి నీటి విడుదల జరుగుతుండటంతో నదీ  తీరంలో వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అచ్చంపేట ఎస్‌ఐ సీహెచ్‌ మణికృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివశించే వారు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు వేటకు వెళ్ళవద్దని తెలిపారు. నదిలో పడవల ద్వారా రాకపోకలు జరపవద్దని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. 


ప్రకాశం బ్యారేజికి.. వరద పోటు

గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడేపల్లి టౌన్‌: సాగర్‌ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోన్నది. దీంతో ముందుజాగ్రత్తగా బ్యారేజ్‌ 70 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలైన అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వరకు అయితే లంక గ్రామాల్లో పంటలకు నష్టం కలుగుతుంది. ఇంతకు మించితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందే.   అయితే ప్రతీ సంవత్సరం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరద నీరు దిగువకు భారీగా విడుదల కావడంతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ప్రకాశం బ్యారేజికి గురువారం సాయంత్రానికి 1లక్షా 5వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు జలవనరుల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12వేల 540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 60 గేట్లను 2అడుగుల మేర 10 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 92 వేల 640 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.  గురువారం అర్ధరాత్రి తర్వాత రిజర్వాయర్‌ వద్ద వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జేఈ తెలిపారు. బ్యారేజి దిగువ ప్రాంతాల్లో లంక భూముల రైతులు, మత్య్సకారులు, పశుపెంపకందారులు నదిలోకి దిగరాదని, తీర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు కలెక్టరేట్‌లో వరద పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి సహాయానికైనా నెంబరు. 08632234014కి ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-08-12T05:58:40+05:30 IST