తగ్గేదిలే..
ABN , First Publish Date - 2022-01-13T05:58:42+05:30 IST
కోడి పందాలు కుదరదు. పందాలు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అన్న హెచ్చరికలు, ఆదేశాలు పట్టించుకునే వారే లేరు. పైగా గతంలో పందాల నిర్వహణ కోసం భారీగా బరులు సిద్ధం చేయగా ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన పోలీసు అధికారులు వాటిని తొలగించారు.
తిరిగి కోఢీకి బరుల సిద్ధం
పోలీసులు తొలిగించిన ప్రాంతంలోనే..
భారీగా ఏర్పాట్లు చేసిన పందాల నిర్వాహకులు
రేపల్లె, జనవరి 12: కోడి పందాలు కుదరదు. పందాలు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అన్న హెచ్చరికలు, ఆదేశాలు పట్టించుకునే వారే లేరు. పైగా గతంలో పందాల నిర్వహణ కోసం భారీగా బరులు సిద్ధం చేయగా ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన పోలీసు అధికారులు వాటిని తొలగించారు. అంతేగాక పందాలు నిర్వహిస్తే సహించమని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతి పందాలు ఉండవని అందరూ భావించారు. అయితే గతానికి ఏమాత్రం తీసి పోకుండా భారీగా బరులు సిద్ధం చేసేందుకే నిర్వాహకులు మొగ్గారు. పోలీసుల హెచ్చరికలు చేసిన ఏమాత్రం తగ్గమన్నట్లుగా కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ నెల 8న రేపల్లె మండలం పెనుమూడి, భట్టిప్రోలు మండలం పల్లెకోనల్లో ఏర్పాటు చేసిన బరులను తొలగించి అక్కడ ఉన్న ఫెన్సింగ్, స్థంభాలను ట్రాక్టర్ల ద్వారా తొలగించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలోనే అధికారుల ఆదేశాలను ధిక్కరించి బుధవారం బరులను ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందాలు నిర్వహించనున్నారు. భారీగా కోడిపందాలతో పాటు లోన బయట, నెంబర్లు, గుండాట, పేకాట ఆడేందుకు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెనుమూడి, పల్లెకోనల్లో నాలుగేసి బరులను సిద్ధం చేస్తున్నారు. రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు 2 బరులు, లక్ష రూపాయలతో వీఐపీ బరిని ఏర్పాటు చేస్తున్నారు. పల్లెకోనలో టెంట్లు, వీఐపీ గ్యాలరీలు, కుర్చీలను లారీల్లో తీసుకువచ్చి బరి సమీపంలో ఉంచారు.