సీబీఐకి అప్పగింతపై తీర్పు వాయిదా

ABN , First Publish Date - 2022-12-13T03:39:47+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది.

సీబీఐకి అప్పగింతపై తీర్పు వాయిదా

అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ అంశంపై సోమవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు సోమవారం ఆదేశాలిచ్చారు. తమ కుమారుడి హత్య కేసులో అనంతబాబుపై నమోదైన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘పోలీసుల దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు. వారి దర్యాప్తుపై నమ్మకం లేదు. మృతుడిని ఎమ్మెల్సీ తన కారులో తీసుకొచ్చి ఇంటి వద్ద అప్పగించినప్పుడు ఎమ్మెల్సీ భార్య కూడా కారులోనే ఉన్నారు. ఆమెను పోలీసులు ఇప్పటివరకు ప్రశ్నించలేదు. మృతుడి శరీరంపై మొత్తం 32 గాయాలు ఉన్నాయి. ఆ స్థాయిలో గాయపరచడం ఒక్క వ్యక్తితో సాధ్యం కాదు.

హత్యలో ఇతరుల ప్రమేయం కూడా ఉంది. నిర్దిష్ట గడువులో కస్టడీ పిటిషన్‌ వేయకుండా పోలీసులు నిందితుడికి సహకరించారు. 14 రోజుల తర్వాత కస్టడీ పిటిషన్‌ వేయడంతో మేజిస్ట్రేట్‌ తిరస్కరించారు. ఎమ్మెల్సీపై రౌడీషీట్‌ ఉన్నప్పటికీ పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు ఉంచిన రిమాండ్‌ రిపోర్టులో ఆయనకు ఎలాంటి నేరచరిత్రా లేదని పేర్కొన్నారు. నేర ఘటన జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించలేదు. దర్యాప్తుపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలన్నా.. బాధితులకు న్యాయం చేయాలన్నా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’ అని కోరారు. పోలీసులు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించేందుకు అనంతబాబు వేసిన అనుబంధ పిటిషన్‌పై ఆయన న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు.

Updated Date - 2022-12-13T03:39:52+05:30 IST

Read more