AP Chief Secretary: శ్రీలక్ష్మి కాదు జవహర్ రెడ్డే.. సీఎస్‌గా నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు..

ABN , First Publish Date - 2022-11-29T18:13:26+05:30 IST

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని జగన్ సర్కార్ నియమించింది. ఈ మేరకు జీఓ జారీ చేసింది. సీఎంఓ స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీగా..

AP Chief Secretary: శ్రీలక్ష్మి కాదు జవహర్ రెడ్డే.. సీఎస్‌గా నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు..

అమరావతి: ఏపీలో (Andhra Pradesh) భారీగా ఐఏఎస్‌ల బదిలీలు (IAS Transfers) జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (AP New Chief Secretary) జవహర్ రెడ్డిని (Jawahar Reddy) జగన్ సర్కార్ నియమించింది. ఈ మేరకు జీఓ జారీ చేసింది. సీఎంఓ స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీగా పూనం మాలకొండయ్యను నియమించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్‌ ప్రకాష్‌, రవాణా శాఖా కార్యదర్శిగా ప్రద్యుమ్నా, వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జ్‌గా వై. మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్‌గా రాహూల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరిగా మహ్మద్ దివాన్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టీటీడీ (TTD) ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ అవ్వాల్సి ఉంది.

అయితే.. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. అంటే.. ఈ నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియనుంది. సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టం లేకో.. మరో కారణం వల్లో 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.

సమీర్‌ శర్మ తర్వాత ఏపీ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలున్నారు. వీరందరిలో.. పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి పేర్లు మాత్రమే తదుపరి సీఎస్‌ పదవికి వినిపించాయి. సమీర్‌ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్‌ తానే అని పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్‌) గట్టిగా భావించారు. కానీ.. ఆమెను సీఎంఓ స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీగా జగన్ సర్కార్ తాజాగా నియమించింది. ఆమె సీఎస్‌ ఆయ్యే చాన్స్‌ లేదని ఐఏఎస్‌ వర్గాలు ముందే చెప్పడం గమనార్హం. శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ఓబుళాపురం గనుల కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. సీఎస్‌ పోస్టు దక్కించుకునేందుకు ఆమెకు లైన్‌ క్లియర్‌ అయిందని ప్రచారం జరిగింది. అయితే.. ఆమెకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉంది.

2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోతే.. తదుపరి సర్కారు ఆమెను పక్కకు తప్పించి, అప్రాధ్యాన్య పోస్టులో నియమించవచ్చు. ఇది ఆమెకు ఇబ్బందికర పరిణామమే అవుతుంది. ఎలాగూ నాలుగేళ్ల సర్వీసు ఉన్నందున ఎన్నికల తర్వాతే ఈ పదవి గురించి ఆలోచించవచ్చునని శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి రాకుండా జగన్‌ కోటరీలో కొందరు వ్యతిరేకించినట్లు తెలిసింది. సామాజిక వర్గం, విధేయత, ఇలా ఏ కోణంలో చూసినా జవహర్‌ రెడ్డికే సీఎస్‌ పోస్టు దక్కుతుందని ప్రభుత్వంలోని చాలా మంది భావించారు. చివరకు అదే జరిగింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదనే అంచనాకు జగన్ వచ్చారని.. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేయడం వెనుక కారణం అదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-11-29T18:16:48+05:30 IST