దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

ABN , First Publish Date - 2022-12-15T03:29:16+05:30 IST

అవినీతి జోలికి పోవద్దని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన మంత్రులకు చేసిన హితోక్తులు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

లక్షల కోట్లు దోచుకొని ఇప్పుడు నీతి వచనాలా?

జగన్‌ బృందం దోపిడీ విలువ మూడు లక్షల కోట్లు

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన టీడీపీ

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘అవినీతి జోలికి పోవద్దని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన మంత్రులకు చేసిన హితోక్తులు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఆయన... ఆయన సామంతులు... పరివారం కలిసి ఈ మూడున్నరేళ్లలో కనీసం రూ.మూడు లక్షల కోట్ల మేర లూఠీ చేసి తరాలకు తరగని ఆస్తి కూడబెట్టారు. ఇప్పటికి చేసింది చాలు... ఇక జాగ్రత్తగా ఉండాలని ఆయన మంత్రులకు చెబుతున్నారా? చేస్తే నేను చేస్తాను తప్ప మీరెవరూ చేయవద్దని అంటున్నారా? ప్రజలు నవ్విపోతారన్న బెరుకు కూడా లేదు’’ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రం కనీవినీ ఎరుగని మాఫియాలను రంగంలోకి తెచ్చి వేల కోట్లను అలవోకగా దోచుకొంటున్న వ్యవహారాలను కళ్ల ముందు చూస్తున్నాం. ముఖ్యమంత్రి... ఆయన పెట్టిన సామంతరాజులు... అనుయాయులు కలిసి బందిపోటు దొంగల మాదిరిగా దోచుకొంటున్నారు.’’ అని విమర్శించారు.

ఓట్లేసిన దళితులను అణచివేయడం న్యాయమా?: వర్ల

జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ‘దళితులు నా బంధువులు, మేనమామలు’ అంటూ చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి, ఓట్లేసి, ముఖ్యమంత్రిని చేస్తే.. అదే దళిత వర్గాలపై ఇనుపపాదం మోపి అణచివేయడం న్యాయమా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. సీఎం జగన్‌ శాసనసభలోను, బయట అధికారిక సభల్లోనూ ‘నా ఎస్సీలు.. నా ఎస్సీలు’ అంటూ పదే పదే ఉటంకిస్తుంటే.. నిజమే కాబోలని సంబరపడిపోయిన దళిత వర్గాల సంక్షేమాన్ని విస్మరించి, అణగదొక్కడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దళితులపై జరిగిన ఏ దాడి కేసులోనూ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సంతృప్తికరంగా దర్యాప్తు చేయలేదంటూ నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతం మొదలుకొని ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్యోదంతం వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దళితులపై జరిగిన దాడి సంఘటనలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం కాకుండా ఆపాలని వర్ల కోరారు.

నేడు అమరజీవి వర్ధంతిని ఘనంగా జరపాలి: అచ్చెన్నాయుడు

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అమరజీవికి నివాళులర్పించాలన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా జరపాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ మహనీయుడి ఆశయాన్ని తుంగలో తొక్కుతూ జగన్‌రెడ్డి రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలని నేతలకు బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.

30 లక్షలని... ఐదిళ్లు నిర్మించారు: కాల్వ

వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ముప్పై లక్షల ఇళ్లు నిర్మిస్తామని హడావుడి చేసిన జగన్‌ ప్రభుత్వం చివరకు ఐదు ఇళ్లు మాత్రం కట్టి రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జగనన్న ఊళ్లు నిర్మిస్తామని పేదలను ఊరించిన జగన్‌ రెడ్డి ఇప్పుడు వారికి కన్నీళ్లు మిగిల్చారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో స్పష్టంగా చెప్పిందన్నారు. ‘‘జగన్‌రెడ్డి చేసిన ప్రకటనల ప్రకారం ఈ మూడేళ్లలో 18 లక్షల ఇళ్లు కట్టాలి. ఇవన్నీ పూర్తి కావాలంటే రూ.28 వేల కోట్లు కావాలి. అందులో పదో వంతు కూడా ఖర్చు చేయలేదు. ఆ డబ్బులు కూడా సొంత పార్టీవారి జేబుల్లోకి పంపారు తప్ప పేదలకు ఇవ్వలేదు. జగన్‌రెడ్డి వందేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చెప్పిన పాతిక లక్షల ఇళ్లు పూర్తి కావు. ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయినందుకు జగన్‌రెడ్డి ప్రభుత్వం లెంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కాల్వ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T03:29:17+05:30 IST