పల్నాడు.. అగ్నిగుండం

ABN , First Publish Date - 2022-05-30T06:12:11+05:30 IST

భానుడు భగభగ మంటున్నాడు. సూర్య ప్రతాపంతో పల్నాడు అగ్నిగుండంలా మారింది.

పల్నాడు.. అగ్నిగుండం
నిర్మానుష్యంగా పల్నాడు రోడ్డు

43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

సాధారణం కంటే 6 డిగ్రీలు అధికం 

రోహిణి కార్తె ప్రభావంతో మండుతున్న జిల్లా

వడగాడ్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం

నరసరావుపేట, మే 29: భానుడు భగభగ మంటున్నాడు. సూర్య ప్రతాపంతో పల్నాడు అగ్నిగుండంలా మారింది. రోహిణి కార్తె ప్రభావంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లా అంతటా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు విలవిల్లాడారు. గురువారం జిల్లా అంతటా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీలు అధికం. అయితే శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రత కొంత తగ్గినా వాతావరణంలో వేడి మాత్రం తీవ్రమైంది.  రాత్రి సమయంలో కూడా వేడిగాలులు ఏమాత్రం తగ్గడండలేదు. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉక్కపోత, వడగాడ్పులకు తోడు పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తెలో ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలకు ప్రజలు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత కనిపిస్తున్నది. మధ్యాహ్న సమయంలో రోడ్లు వేడి ఆవిర్లు కక్కుతున్నాయి. ఎండ తీవ్రతతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయడంలేదు. ఎండలతో నరసరావుపేట రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రానున్న వారం రోజులు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.  

అప్రమత్తతే మేలు

పెరుగుతున్న ఉష్ణగ్రతలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లే వారు నీటిని ఎక్కువుగా తాగాలని, రక్షణగా గొడుగు వాడితే మంచిదంటున్నారు.  ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి డీ హైడ్రేట్‌ కాకుండా ఉండడానికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం లేదా మజ్టిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు సేవించాలని సూచిస్తున్నారు. వృద్ధులు,  చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 

వేసవి తాపం.. తీరంలో సందడి

సూర్యలంకలో సేదతీరిన ప్రజానికం

బాపట్ల, మే 29: ఆదివారం ఎండ మండింది. ఉక్కపోతకు తోడు వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం 8 గంటల నుంచి భానుడు భగభగమని మండాడు. బాపట్ల జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రత కనిష్ఠంగా 32.3, గరిష్ఠంగా 41.2 సెంటీగ్రేడ్‌లుగా నమోదైంది. దీంతో బాపట్ల, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో సూర్యలంకకు తరలివచ్చి సముద్ర జలాల్లో సేదతీరారు. పెద్దసంఖ్యలో జనాలు తరలిరావడంతో తీరంలో వేసవి సందడి నెలకొంది. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో  సూర్యలంకకు కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. తీరంలో స్నానాలు ఆచరిస్తూ సముద్ర కెరటాల మధ్య ఆటలాడుతూ గంతులు వేస్తూ వేసవి వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు.    


ఉష్ణోగ్రతల వివరాలు 

ప్రాంతం           ఉష్ణోగ్రత డిగ్రీలలో

----------------------------------------------

వినుకొండ          43

సత్తెనపల్లి            43

చిలకలూరిపేట         43

అమరావతి 43

పెదకూరపాడు        43

రెంటచింతల        42

మాచర్ల            42

నరసరావుపేట      42

పిడుగురాళ్ళ        42


Read more