ఇంటింటికీ కుళాయి.. నత్తనడకన!

ABN , First Publish Date - 2022-04-24T05:42:01+05:30 IST

జలజీవన్‌ మిషన్‌(జేజేఎం) కార్యక్రమం అమలులో గుంటూరు జిల్లా పురోగతి సాధించడంలో వెనకబడిపోయింది.

ఇంటింటికీ కుళాయి..  నత్తనడకన!

 జల్‌జీవన్‌ మిషన్‌లో జిల్లా వెనుకంజ

 

గుంటూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జలజీవన్‌ మిషన్‌(జేజేఎం) కార్యక్రమం అమలులో గుంటూరు జిల్లా పురోగతి సాధించడంలో వెనకబడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం బారెడు ఉండగా పురోగతి చూస్తే మూరెడు కూడా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేసే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు. ప్రతీ రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఒకపక్క దేశ వ్యాప్తంగా ఈ పథకం అమలులో ఇప్పటికే 48 శాతం వరకు లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతోన్నాయి.  గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా విస్తీర్ణం పెద్దది కావడం వలన కొన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడు 16 మండలాలకు పరిమితమైన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా చేయడమే జేజేఎం ప్రధాన లక్ష్యం. ఇంటింటికి సర్వే నిర్వహించి మండలాల వారీగా ఎన్ని కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలనే గణాంకాల లెక్క తేల్చారు. కొల్లిపరలో 9,152, తుళ్లూరులో 5,177, చేబ్రోలులో 8,753, మంగళగిరిలో 392, పెదనందిపాడులో 159, వట్టిచెరుకూరులో 524, ప్రత్తిపాడులో 1,368, కాకుమానులో 1,553, గుంటూరు రూరల్‌లో 1,807, మేడికొండూరులో 4,667, పెదకాకానిలో 4,706, ఫిరంగిపురంలో 7,453, తాడికొండలో 8,702, పొన్నూరులో 9,106, తెనాలిలో 9,732, దుగ్గిరాలలో 16,021 కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేసేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గుంటూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. మొత్తం 89,272 కుళాయి కనెక్షన్లను ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేయాలి. ప్రస్తుత ఏప్రిల్‌ నెలకు 6,248 కనెక్షన్లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టారు. ఇప్పటికే 23 రోజులు ఈ నెలలో గడిచిపోగా కేవలం 99 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగారు. అవి కూడా కొల్లిపరలో 63, తుళ్లూరులో 21, చేబ్రోలులో 11, మంగళగిరిలో నాలుగు కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మిగతా మండలాల్లో ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు. 

ప్రధానంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి తాగునీటి వనరులను ఆయా గ్రామాల్లో పెంచాలి. అలానే పైపులైన్లను నిర్మించాలి. వీటి కోసం అవసరమైన పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోన్నది. 247 ఈ తరహా పనులను గుర్తించారు. వాటిల్లో 40 మాత్రమే కాంట్రాక్టర్లకు కేటాయించగా నిర్మాణం పది చోట్ల ప్రారంభమయ్యాయి. దీని దృష్ట్యా జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. 


Updated Date - 2022-04-24T05:42:01+05:30 IST