ఆధునికీకరణ.. సాగదీత!

ABN , First Publish Date - 2022-10-03T06:30:02+05:30 IST

గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రివర్స్‌ టెండరింగ్‌ పూర్తయి ఏడాది కావస్తున్నా నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు.

ఆధునికీకరణ.. సాగదీత!
గుంటూరు ఛానల్‌

గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ ఎప్పుడో?

రివర్స్‌ టెండరింగ్‌ పూర్తి అయి ఏడాది 

ఇంకా అనుమతులు ఇవ్వని ప్రభుత్వం

ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహం

గుంటూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రివర్స్‌ టెండరింగ్‌ పూర్తయి ఏడాది కావస్తున్నా నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు.  కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంపై ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నీటిపారుదల ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ ప్రాజెక్టు దయనీయ స్థితి చూస్తే ఇట్టే స్పష్టమౌతుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే పరిపాలన అనుమతులు వచ్చి టెండరింగ్‌ కూడా పూర్తి కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే దానిని నిలిపేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. దానిని ఖరారు చేసి ఏడాది దాటిపోయినా నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఆమోదం వచ్చిన తర్వాత పనులు మొదలు పెడతామని జలవనరుల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నారు. గతంలో మంత్రులు ఇతర జిల్లాలకు నిధులు ఇస్తూనే సొంత జిల్లాల్లో ప్రాజెక్టులకు అధికమొత్తంలో కేటాయింపులు జరిపి తమ ముద్ర వేసేవారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన నీటిపారుదల శాఖని దక్కించుకొన్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు ఇప్పటివరకు కనీసం సమీక్ష కూడా జరకపోకవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 

గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ 20 ఏళ్ల క్రితమే పురుడు పోసుకొంది. ఇన్వెస్టిగేషన్‌, మట్టి నమూనాల పరీక్షలు వంటి అన్ని అడ్డంకులు దాటుకొని 2019కి ముందే టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల దశకు వచ్చింది. 2015లోనే రూ.378.25 కోట్ల అంచనా విలువతో పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. టెండర్లు కూడా పూర్తి అయి పనులు ప్రారంభమయ్యే సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో గెలుస్తూనే వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులన్నింటిని నిలిపేసింది. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఏడాది క్రితమే ఏజెన్సీని ఖరారు చేసింది. అయితే పనులు ప్రారంభించేందుకు ఆమోదం తెలపకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. 

ఈ ఛానల్‌ క్రింద ప్రస్తుతం 27 వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. 600 క్యూసెక్కుల డిజైన్‌తో మెయిన్‌ ఛానెల్‌ని నిర్మించారు. అయితే కాలువ గట్లు బలహీనపడిపోవడంతో ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. అలానే ఛానెల్‌ పొడవునా పెరుగుతున్న జమ్ము, నాచుతో నీటి ప్రవాహం మందగిస్తోంది. దీంతో ఛానల్‌ చివరి భూములకు సాగునీరు అందని పరిస్థితి. దీనిని పరిగణనలోకి తీసుకొని 0 నుంచి 47వ కిలోమీటర్‌ వరకు పొడిగింపు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎలాంటి భూసేకరణ చేయాల్సిన పనిలేదు. ఛానల్‌కు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించడం ద్వారా 750 క్యూసెక్కుల డిశ్చార్జ్‌ చేయొచ్చని డిజైన్‌లు రూపొందించారు. తద్వారా 27 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు నగరంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరతాయి. దాదాపుగా 33 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఛానల్‌ ఆధునికీకరణ జరిగితేనే పొడిగింపు ప్రాజెక్టుకు మేలు జరుగుతుంది. లేకుంటే గుంటూరు ఛానల్‌ పొడిగించినా నీరు ప్రవహించదు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంపై ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-10-03T06:30:02+05:30 IST