పేదలకు ఉచితంగా వైద్యం
ABN , First Publish Date - 2022-08-11T05:51:49+05:30 IST
మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సంజీవని ఆరోగ్యరథం
ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
దుగ్గిరాల, మంగళగిరి, ఆగస్టు10: మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. దుగ్గిరాలలో ఆయన బుధ వారం జెండా ఊపి ఆరోగ్య సంజీవి రథాన్ని ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పూజలు, ప్రార్థనలు జరిపిన అనంతరం రథానికి జెండా ఊపి ప్రారంచారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ ఈనెలలో మంగళగిరిలో, వచ్చేనెలలో తాడేపల్లిలోనూ రెండు సంజీవని ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటుచేయించి ప్రజలకు అవసరమైన వైద్యసేవలను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేందుకు టాటా సంస్థతో ఒప్పందం కోసం మాట్లాడామన్నారు. 2019 లోనే లక్ష్మీనరసింహస్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటుచేసి వారిని ఆదుకోవడం ఆనాడే ప్రారంభించామని, కొవిడ్ సమయంలో జూమ్‌ద్వారా టెలిమెడిసిన్ అందించామని, ఆక్సిజన్ సిలెండర్లు కూడా అందించామన్నారు. నిరుపేదలైన చిరువ్యాపారులకు తోపుడుబండ్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను, తాగునీరు అందించామన్నారు. ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ అన్న క్యాంటిన్‌ను, స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టుమిషన్లు అందించామన్నారు. రత్నాలచెరువు సమీపంలో రోడ్లు వేశామన్నారు. యువతీ యువకులకు ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, గూడూరు వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, జంగాల సాంబశివరావు, కొమ్మారెడ్డి కిరణ్, తాళ్ల అశోక్, మన్నెం అశోక్, జంపాల వెంకటకృష్ణారావు, పొన్నం సాంబశివరావు, అంచే హరినాధ్‌బాబు, సీతా రామయ్య, వల్లూరు నరసింహారావు, కాకా బాబు, యడ్ల రామారావు, పినపాటి కరుణాకర్, బాషా, సాదిక్, రవిచంద్, జస్వంత్, శ్రీనివాసరావు, టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ముర్తుజానగర్‌కు చెందిన 20 మంది ముస్లిం యువకులు, మహిళలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.
గంజి చిరంజీవికి
తగిన గౌరవాన్ని ఇచ్చాం..
స్థానిక టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎమ్మెస్సెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తాను నిరంతరం అండగా నిలబడతానన్నారు. ఎన్నికలముందు ఎన్నో వాగ్ధానాలు చేసి, మరెన్నో డ్రామాలు చేసి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొండపోరంబోకు, రోడ్డు పోరం బోకు స్థలాలలో వుంటున్నవారి నివాసాలను కూలగొట్టిస్తున్నారని విమర్శించారు. మీ పుణ్యమా అంటూ నిరాశ్రయిలైనవారికి ముందు నివేశన స్థలాలను ప్పించాలని ఆయన ఎమ్మెల్యే ఆళ్లకు విజ్ఞప్తి చేశారు. గంజి చిరంజీవి రాజీనామా వ్యవహారాన్ని విలేకరులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చినపుడు దానిపై తమ పార్టీ సీనియర్లు నందం అబద్దయ్య, దామర్ల రాజు స్పందించి అన్నీ విషయాలను ఇప్పటికే వివరించారన్నారు. చిరంజీవి 2014లో మాత్రమే పార్టీలోకి వచ్చినా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చి అనేక కీలకమైన పదవులను కట్టబెట్టమన్నారు. కొద్దికాలం కిందట చిరంజీవికి రాష్ట్రపార్టీలో కూడ స్థానం కల్పించి గౌరవించామన్నారు. తనపై 2012 నుంచి ఎన్నో దుష్ఫ్రచారాలు, నిందారోపణలు చేస్తూ వచ్చారని.. ఏ ఒక్క ఆరోపణను ఇంతవరకు రుజువు చేయలేకపోయారని లోకేశ్ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు దామర్ల రాజు, మండల పార్టీ అధ్యక్షుడు తోట పార్ధసారధి, తెలుగు మహిళ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.