టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు
ABN , First Publish Date - 2022-07-06T05:42:24+05:30 IST
తెలుగుదేశం పార్టీ వర్గీయులపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు ఆరోపించారు.

వినుకొండ సీఐపై ఎస్పీకి జీవీ ఫిర్యాదు
నరసరావుపేట టౌన్, జూలై 5: తెలుగుదేశం పార్టీ వర్గీయులపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు ఆరోపించారు. వినుకొండ మండలం నడిగడ్డలో జరిగిన దాడిలో పోలీసులు బనాయించిన అక్రమకేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం జీవీ మీడియాతో మాట్లాడుతూ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గుండాలా వ్యహరించి, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారని అన్నారు. వినుకొండ సీఐ అశోక్‌బాబు ఎమ్మెల్యే బొల్లాతో కుమ్మక్కై టీడీపీ వర్గీయులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయుల నుంచి కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదన్నారు. జల్లయ్య హత్య కేసులో కూడా కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడుల, దుర్మార్గాలను ఖండిస్తున్నామన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని ఎస్పీని కోరామన్నారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన్‌బాబు, తెలుగుయువత పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నడిగడ్డ బాధితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.