జిల్లా కార్యాలయాలు ఎక్కడ?

ABN , First Publish Date - 2022-03-05T05:33:35+05:30 IST

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టింది. ఉగాది పర్వదినం రోజు అంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి నూతన జిల్లాల్లో పాలన ఉంటుందని ప్రభుత్వం సూచించింది.

జిల్లా కార్యాలయాలు ఎక్కడ?
నరసరావుపేటలో భవనాలను పరిశీలిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ

వచ్చే నెల నుంచి నూతన జిల్లాల పాలన

అధికారుల పర్యటనలు.. పరిశీలనలతో సరి

జిల్లా కేంద్రాల్లో కొలిక్కిరాని కార్యాలయాల ఎంపిక

ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్న అధికారుల కసరత్తు

ఏ ఒక్క కార్యాలయానికి భవనాలను ఎంపిక చేయని వైనం


నరసరావుపేట, బాపట్ల, మార్చి 4: లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టింది. ఉగాది పర్వదినం రోజు అంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి నూతన జిల్లాల్లో పాలన ఉంటుందని ప్రభుత్వం సూచించింది. అయితే పల్నాడు/నరసరావుపేట, బాపట్ల జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలకు అవసరమైన భవనాల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. గడువు సమీపిస్తున్నా ఇంకా కొలిక్కిరాలేదు. బాపట్ల, నరసరావుపేట కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న భవనాలను అధికారులు గత కొన్ని రోజులుగా పరిశీలిస్తున్నారు. అయినా అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చి వాటిని ఎంపిక చేయలేకపోతున్నారు. తొలుత ప్రతిపాదించిన భవనాల ఎంపికలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. కార్యాలయాలకు భవనాల ఎంపికపై నెల రోజులుగా కసరత్తు కొనసాగుతునే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో కొత్త జిల్లాల నుంచి పరిపాలన ఎలా మొదలవుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆయా పట్టణాల్లోని ప్రభుత్వ భవనాలను ఇప్పటికే కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు, ఎస్పీ విశాల్‌ గున్నీ తదితరులు పరిశీలించారు. అయినా కార్యాలయాల ఎంపిక, వాటిల్లో వసతుల కల్పన అంశాలు ఇంకా ఆచరణలోకి రాలేదు. జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి భవనాలను ఎంపిక చేయడం, వీటిలో పరిపాలనకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడం, వసతులు మెరుగుపరచడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. నెల రోజుల్లో పనులు పూర్తి అయ్యే పరిస్థితులు కానరావడంలేదు. అంటే దీనినిబట్టి నేటి వరకు ఏ ఒక్క కార్యాలయానికి భవనాల ఎంపిక చేయలేదని తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఒక్క భవనానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కాలేదు. పరిశీలన దశలోనే పనులు ఉన్నాయి.  తాజాగా శుక్రవారం డీఐజీ తివిక్రమవర్మ పోలీసు కార్యాలయాలకు సంబంధించి నరసరావుపేట, బాపట్లలోని పలు భవనాలను పరిశీలించారు. నరసరావుపేటలో కలెక్టరేట్‌ కోసం పల్నాడు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రిని ప్రతిపాదించారు. ఈ భవనాలను అధికారులు పరిశీలించారు. ఆస్పత్రిని ఖాళీ చేయించి లింగంగుంట్లలోని నూతన భవనంలోకి మార్చాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయినా ఎందువలనే ఆ ప్రతిపాదన వాయిదా పడింది. కలెక్టరేట్‌ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆస్పత్రిని ఖాళీ చేయవద్దని అధికారులు సూచించినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నారు. ఇక పెద చెరువులోని శివాఅతిథి గృహాంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జలవనరుల శాఖ కార్యాలయ భవనంలో ఎస్పీ కార్యాలయం, ఏఎస్పీ, ఇంటిలిజెన్స్‌ తదితర 21 విభాగాల ఏర్పాటు చేయాలని, లింగంగుంట్లలోని రాజీవ్‌ స్వగృహ భవనాలలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాణిజ్య పన్నుల కార్యాలయం, ఐసీడీఎస్‌ భవనాలలో జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయాలు, డీఎస్పీ బంగళాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే  వీటిలో కొన్ని మార్పుటు చోటు చేసుకునే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇక బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాలను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి డీఐజీ త్రివిక్రమవర్మ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కేటాయించిన భవనాలలో వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఆర్‌డీలో కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు జీవో జారీ చేశారన్నారు. ప్రధాన అధికారుల కార్యాలయాల విభాగాల ఏర్పాటు తర్వాత పోలీసుశాఖలో వివిధ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు.  ==============================================================================================

Read more