కలెక్టర్‌కు అప్పగించిన సొసైటీ అధ్యక్షులు

ABN , First Publish Date - 2022-12-07T01:16:43+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) బోగస్‌ రుణాల సూత్రధారి ఉంటూ సస్పెండైన ప్రత్తిపాడు బ్రాంచ్‌ మేనేజర్‌ రవి కుమార్‌ను సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు మంగళవారం రాత్రి నిర్బంధించారు.

కలెక్టర్‌కు అప్పగించిన సొసైటీ అధ్యక్షులు
కలెక్టరేట్‌ ఛాంబర్‌ వద్ద సొసైటీ అధ్యక్షులు, సిబ్బంది

కలెక్టర్‌ సమక్షంలో రవికువర్‌ను విచారించిన డీసీవో

గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) బోగస్‌ రుణాల సూత్రధారి ఉంటూ సస్పెండైన ప్రత్తిపాడు బ్రాంచ్‌ మేనేజర్‌ రవి కుమార్‌ను సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు మంగళవారం రాత్రి నిర్బంధించారు. రవికుమార్‌ ప్రమేయంతో ప్రత్తిపాడు బ్రాంచ్‌లో రూ.3.19 కోట్లు పక్కదారి పట్టినట్లు శాఖాపరమైన దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సొసైటీల పేరుతో బినామీ రుణాలు తీసుకోవటంతో సీఈవోలు, సొసైటీల అధ్యక్షులపై కేసులు నమోదు చేసి, సహకారశాఖ అధికారులు వారి ఆస్తులను ఆటాచ్‌ చేశారు. ఆయన కోసం కొంతకాలంగా సొసైటీల అధ్యక్షులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో సస్పెండై ఆరునెలలైందని నిబంధనాల మేరకు తనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ మంగళవారం ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ లాల్‌పురం రాము, సీఈవో కృష్ణవేణికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. తాము గాలిస్తున్న రవికుమార్‌ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు సొసైటీ అధ్యక్షులకు తెలిసింది. దీంతో ప్రత్తిపాడు బ్రాంచ్‌ పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు అక్కడకు చేరుకుని ఆయన్ను నిర్బంధించారు. ఈ సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్లు తెలిసింది. అనంతరం ఆయన్ను ఎమ్మెల్యే సుచరిత వద్దకు తీసుకెళ్లగా ఆమె సూచన మేరకు కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. సొసైటీ అధ్యక్షులు మన్నవ వీరనారాయణ (చింతపల్లిపాడు), కట్టా సుబ్బారావు (చినకోండ్రుపాడు), లక్ష్మారెడ్డి(నిమ్మగడ్డవారిపాలెం), లింగారావు(వింజనంపాడు), సీఈవోలు రవికుమార్‌ను కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి సమక్షంలో డీసీవో వీరాచారి రెండు గంటలపాటు రవికుమార్‌ను విచారించి వివరాలను నమోదు చేశారు. ఈ కుంభకోణంలో మరో ఐదుగురు పాత్ర ఉన్నట్లు మేనేజర్‌ రవికుమార్‌ చెప్పినట్లు సొసైటీ అధ్యక్షులు తెలిపారు.

పోలీసులకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశాలు

ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడటంతో పాటు సహకారశాఖ అపఖ్యాతి పాలైందని రవికుమార్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను పోలీసులకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రవికుమార్‌ను బుధవారం పోలీసులకు అప్పగించాలని సహకారశాఖ అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-12-07T01:17:13+05:30 IST