ధాన్యం బకాయి.. రూ.27 కోట్లు

ABN , First Publish Date - 2022-07-06T05:34:35+05:30 IST

పాలకుల మాటలు నమ్మాం.. నట్టేట మునిగాం. ఆర్బీకేలకు ధాన్యం అమ్మాలన్నారు.. ఆ ప్రకారం చేశాం.. అయినా ఇంతవరకు నగదు అందలేదు.. ఇదీ జిల్లాలోని అన్నదాతల గోడు.

ధాన్యం బకాయి.. రూ.27 కోట్లు

రోజుల తరబడి జమ కాని నగదు

ప్రకటనల్లోనే మూడు వారాల్లో జమ

ఖరీఫ్‌ పెట్టుబడులకు అన్నదాతల అగచాట్లు

అధికారులకు అర్జీలు ఇస్తున్నా స్పందన శూన్యం


బాపట్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పాలకుల మాటలు నమ్మాం.. నట్టేట మునిగాం. ఆర్బీకేలకు ధాన్యం అమ్మాలన్నారు.. ఆ ప్రకారం చేశాం.. అయినా ఇంతవరకు నగదు అందలేదు.. ఇదీ జిల్లాలోని అన్నదాతల గోడు. జిల్లాలో అన్నదాతలకు  ప్రభుత్వం దాదాపు రూ.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు చేసిన మూడు వారాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని పాలకులు ప్రకటించారు. గిట్టుబాటు ధరతో పాటు మూడు వారాల్లో నగదు వస్తుందనే ఆశతో ఆర్బీకేల్లో రైతులు ధాన్యం విక్రయించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇంతవరకు నగదు అందలేదు. దీంతో ఒకవైపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండగా మరోవైపు ఖరీఫ్‌ పనులకు అవసరమైన నగదు చేతిలో లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. ఒక విధంగా చూస్తే దళారులకు అమ్మిన వారి పరిస్థితే బాగుందని పలువురు వాపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు వారాల్లోపే నగదు జమ అన్న ప్రభుత్వం మాటలు ప్రగల్భాలుగానే మారాయి. రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ జూన్‌ నెలలో ముగిసినా ఇంకా అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవలేదు. రబీ సీజన్‌లో 98,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. 4,465 మంది రైతుల దగ్గర నుంచి 49,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ఏప్రిల్‌ నెలఖారు నుంచి జూన్‌ చివరి వరకు ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రూ.54 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా  రూ.27 కోట్ల వరకు రైతులకు బకాయిలు ఉన్నాయి. వీరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు స్పందనలో కొంతమంది రైతులు ధాన్యం బకాయిల గురించి అర్జీలు ఇస్తున్నారు. ధాన్యం సొమ్ములు వెంటనే ఇవ్వకపోడంతో ఖరీఫ్‌ పెట్టుబడులకు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 


వడ్డీల భారంతో వెనుకంజ

గతానుభవాల దృష్ట్యా ధర తక్కువయినా ఎక్కువమంది రైతులు బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి మొగ్గుచూపారు. గతంలో మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్మానని కానీ డబ్బులు పడేసరికి దాదాపు మూడు నెలలైందని, తెచ్చిన అప్పులకు వడ్డీ విపరీతంగా పెరిగిపోయిందని వేమూరు మండలానికి చెందిన  ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి రేటు తక్కువయినా బయటే అమ్ముకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విధానాలతో మద్దతుధర ఉన్నప్పటికీ బయట అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు చెబుతున్నారు.  

Updated Date - 2022-07-06T05:34:35+05:30 IST