ధాన్యానికి మొలకులు

ABN , First Publish Date - 2022-12-15T00:49:07+05:30 IST

మాండస్‌ ముప్పు తప్పినా అన్నదాతలను నిండా ముంచింది

ధాన్యానికి మొలకులు
కూచినపూడి ప్రాంతంలో వరి ఓదెలు తడిసి మొలకెత్తగా వాటిని చూపెడుతున్న రైతు

దిగుబడులపై తీవ్ర ప్రభావం

పొలాల్లో తిష్ట వేసిన వర్షపు నీరు

80 శాతం.. రైతుల కన్నీటి పర్యంతం

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న అన్నదాతలు

రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, డిసెంబరు 14: మాండస్‌ ముప్పు తప్పినా అన్నదాతలను నిండా ముంచింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షంతో పొలాలు, పంటలు నీట మునిగాయి. బుధవారానికి కూడా పొలాల్లోని నీరు నిలిచే ఉంది. ఒకవైపు ఈదురుగాలులతో కూడిన వర్షం మరోవైపు చేలలను వీడని వర్షపు నీటితో రైతన్న నిండా మునిగిపోయాడు. వర్షం కురిసిన నాలుగు రోజులైనా ఇంకా వర్షపు నీరు పంట పొలాల్లోనే తిష్ఠ వేయడంతో నష్టం గంటగంటకు పెరిగిపోతోంది. నీటిని ఆయిల్‌ ఇంజన్ల ద్వారా బయటకు తోడుతున్నారు. నీరు బయటకు తోడే అవకాశం లేని రైతులు పంటను చూసి భోరున విలపిస్తున్నారు. ఓదెలు నీటిలో ఉండటంతో మొలకలు వస్తున్నాయి. కొంత పంటనైనా దక్కించుకోవాలని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో అక్కడక్కడ రైతులు హార్వెస్టర్‌తో కోతలు కోయిస్తున్నారు. గాలులకు వల్ల పడిపోయిన పంట, తడిసిన ఓదెల వల్ల తమపై అదనపు వ్యయభారం పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు మండలంలో వర్షాల వల్ల 40 శాతం మేర వరి పంట దెబ్బతింది. ఓదెలను తిప్పుతుంటే మొలకలెత్తిన కంకులు దర్శనమిస్తుండటంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆశాజనకంగా దిగుబడులు ఉంటాయని ఆశించగా తుఫాన్‌తో ఆశలు నీరుగారాయని వాపోతున్నారు. కోత కోయకుండా నేలకు ఒరిగిపోయిన పంటను పైకి లేపి కట్లు కట్టించుకోవాలన్నా కూలీలు దొరక్క, దొరికినా కూలీ రేట్లు అధికం కావడంతో చాలామంది రైతులు పంటను అలాగే వదిలి వేస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలు వేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. వారికి రైతులు మొలకలెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని చూపించి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. చేతికి అందే సమయంలో వర్షాలతో వరి దెబ్బతినడంతో పెట్టుబడులు ఎంతమేర వస్తాయో తెలియక ఆందోళనలో ఉన్నారు. భట్టిప్రోలు మండలంలో 7650 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వేమూరు నియోజకవర్గంలో 80శాతం రైతులు పంట నష్టపోయారు. నిలువునా ఉన్న పైర్లు పూర్తిగా వాలిపోవడంతో పాటు వర్షానికి గాలులకు గింజ రాలిపోయింది. దిక్కుతోచని రైతులు కంటతడి పెడుతున్నారు.

Updated Date - 2022-12-15T00:49:11+05:30 IST