వైసీపీ నేతపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-10-11T06:16:08+05:30 IST

వైసీపీ పెదకాకాని మండల అధ్యక్షుడు గుంటముక్కల పూర్ణచంద్రరావుపై దాడి జరిగింది.

వైసీపీ నేతపై హత్యాయత్నం
గాయాలపాలైన పూర్ణచంద్రరావు

 ఇనుపరాడ్లు, కత్తులతో తెగబడ్డ దుండగులు

 సొంతపార్టీలో రాజకీయ వైరమే కారణమా?


 పెదకాకాని, అక్టోబరు10: వైసీపీ పెదకాకాని మండల అధ్యక్షుడు గుంటముక్కల పూర్ణచంద్రరావుపై దాడి జరిగింది. సోమవారం రాత్రి గుంటూరులో వ్యక్తిగత పనులు ముగించుకొని తన నివాసమైన అమరావతి రోడ్డులోని ద్వారకానగర్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే క్రమంలో  గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి మారణాయుధాలతో దాడి చేశారు. దీని వెనుక సొంతపార్టీలో రాజకీయ వైరమే కారణమనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన గుంటముక్కల పూర్ణచంద్రరావు(పూర్ణ) సుదీర్ఘకాలంగా వైసీపీ  పెదకాకాని మండలం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. అయితే గత మూడునెలలుగా పొన్నూరు నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు పొడచూపాయి. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు, పూర్ణకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే రోశయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఓ వర్గం తయారైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రోశయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి నేరుగా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్యే రోశయ్యకు, పూర్ణ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పూర్ణపై దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. 

అమరావతి రోడ్డులో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులు, ఇనుపరాడ్లతో పూర్ణపై దాడికి దిగారు. చీకట్లో ఓ పథకం ప్రకారం అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి ఇనుప రాడ్డును అడ్డంపెట్టి కింద పడేటట్టు చేశారు. కింద పడ్డ పూర్ణపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రమైన రక్తస్రావంతో కింద పడిపోయి ఉన్న ఆయన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. నియోజకవర్గ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

Updated Date - 2022-10-11T06:16:08+05:30 IST