రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:04:31+05:30 IST
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో నరసాయపాలెంగ్రామానికి చెందిన భార్యభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది.
ఆపస్మారక స్థితిలో కుమారుడు
బాపట్లరూరల్, అక్టోబరు 6 : తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో నరసాయపాలెంగ్రామానికి చెందిన భార్యభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన మాలపాటి సుబ్బారావు (71), అతని భార్య సుబ్బారావమ్మ (70), కుమారుడు మాలపాటి శోభనబాబులు గురువారం తిరులమ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి మూడుకార్లల్లో తిరుపతి బయలుదేరారు. రెండుకార్లు కాళాహాస్తీ సమీపంలోకి చేరుకోగా మాలపాటి సుబ్బారావు ప్రయాణం చేస్తున్న కారును నెల్లూరు సమీపంలోకి చేరుకోగానే ఓ లారీ వెనక నుంచి రాసుకుంటూ వెళ్లింది. వెంటనే వారు ఆ లారీని నిలుపుదల చేసి లారీ డ్రైవరుతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసి బస్సు వేగంగా వెనుక నుంచి సుబ్బారావు, సుబ్బరావమ్మలు కూర్చున్న కారును ఢీ కొనటంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారితోపాటు కారులోవున్న వారి కుమారుడు శోభనబాబుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శోభనబాబు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈఘటనతో నరసాయపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.