Conocarpus Tree: ఎక్కడ చూసినా ఈ చెట్లు పెంచుతున్నారు.. కానీ ఇవి ఎంత డేంజర్ అంటే..

ABN , First Publish Date - 2022-11-27T16:59:31+05:30 IST

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కొనోకార్పస్‌ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు..

Conocarpus Tree: ఎక్కడ చూసినా ఈ చెట్లు పెంచుతున్నారు.. కానీ ఇవి ఎంత డేంజర్ అంటే..

ఈ చెట్టుతో చేటే..

కాటేసే.. కొనోకార్పస్‌

జీవ మనుగడకు నష్టం

వృక్షాల పుప్పొడితో శ్వాసకోస వ్యాధులు

పట్టణం.. పల్లెల్లో ఎక్కడ చూసినా దర్శనం

ఇతర రాష్ట్రాల్లో నిషేధం.. ఇక్కడ విస్తృతంగా

మూడు జిల్లాల్లో లక్షల్లో దర్శనమిస్తున్న చెట్లు

నరసరావుపేట: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కొనోకార్పస్‌ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు, పర్యావరణానికి హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కాదు. పచ్చని చెట్లతో వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం జీవం మనుగడ ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంది. అందుకే మొక్కల పెంపకాన్ని.. చెట్ల సంరక్షణను ప్రభుత్వాలతో పాటు పర్యావరణవేత్తలు, ప్రజలు ఓ ఉద్యమంలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వరకు విస్తృతంగా పెంచిన కొనోకార్పస్‌ చెట్ల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు తేల్చారు.

ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకు ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్న కొనోకార్పస్‌ చెట్లతో ముప్పు వాటిల్లితుందని పర్యావరణవేత్తలు తేల్చిచెప్పారు. పచ్చగా.. ఏపుగా.. అందంగా.. తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి, డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పచ్చదనం సుందరీకరణలో భాగంగా మున్సిపాల్టీల్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కొనోకార్పస్‌ చెట్ల పెంపకం గత కొంతకాలంగా పల్లెలకు కూడా విస్తరించింది.

దుబాయ్‌లో ప్రసిద్ధి

కొనోకార్పస్‌ చెట్లను ఉష్ణ మండ ప్రాంతాల్లో, తీర ప్రాంతాలలో మడ అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటిని మాంగ్రూన్‌ మొక్కలని, దుబాయ్‌ చెట్లు అని కూడా పిలుస్తారు. తక్కువ కాలం లో ఏపుగా పెరగడం, వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతీ రుతువులోనూ పచ్చదనం కళకళలాడుతుంది. ఈ గుణమే దీన్ని అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా., ఆసియా దేశాల్లోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఈ మొక్కను సుందరీకరణకు వినియోగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా, మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చ దనంతో నిండిపోతున్నాయి. వారాల వ్యవధి లో మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో మన రాష్ట్రంలోనూ మునిసిపాల్టీలు ఈ మొక్కలను నాటాయి.

ఈ చెట్టు పట్టణం పల్లె అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పాతుకుపోయింది. పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు. ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల శాసకోస వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రెయినేజి పైపుల ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ చెట్లపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్‌, ఇరాన్‌, కతర్‌, యూఏఈ తదితర దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. వీటిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువూ దీని ఆకులను తినవని పరిశోధనల్లో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగజేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొనోకార్పస్‌ చెట్లను తొలగించడం తక్షణావసరంగా ఉంది.

హడలిపోతోన్న వృక్ష శాస్త్రవేత్తలు..

కొనోకార్పస్‌ మొక్క నిటారుగా ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనం కళకళ లాడుతుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాలతో ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నదని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుంచి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోస వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీంతో కొనోకార్పస్‌ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. కొనో కార్పస్‌ను డేంజర్‌ ట్రీగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ఈ చెట్లను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపాల్టీలలో నిషేధిత మొక్కలు ఇంకా నాటుతూనే ఉన్నారు. వీటి పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చెట్ల వేరు వ్యవస్థ మంచినీటి పైపులైన్లు, కేబుల్‌, డ్రెయినేజ్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన కొనోకార్పస్‌ నిషేధంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-27T16:59:51+05:30 IST