విద్యతోనే గిరిజనుల అభ్యున్నతి

ABN , First Publish Date - 2022-08-10T06:12:48+05:30 IST

గిరిజనుల అభివృద్ధికి చదువు ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు. రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన ఆదివాసి దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

విద్యతోనే గిరిజనుల అభ్యున్నతి
ఆదివాసి దినోత్సవంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి. పాల్గొన్న జేసీ తదితరులు

ఆదివాసి దినోత్సవంలో కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

గుంటూరు(తూర్పు), ఆగస్టు 9: గిరిజనుల అభివృద్ధికి చదువు ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు. రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన ఆదివాసి దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.  జిల్లాలో 69వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయని వీరందరూ మైదాన, పట్టణ ప్రాంతాలకు దగ్గరగానే ఉన్నారని తెలిపారు. గిరిజనులకు ఏవైన సమస్యలు ఉంటే  రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య సచివాలయాల్లో జరిగే స్పందనలో తెలపవచ్చన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్‌ 5, 6లలో గిరిజనులకు రక్షణ కల్పించారని, గిరిజనులకు రాజ్యాంగంలో అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలలు లేవని, వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు బీఆర్‌ అంబేద్కర్‌, ఏకలవ్యుడు, రాషఘవయ్య, సేవాలాల్‌ మహారాజ్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు, నాటికలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో  జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి మధుసూదనరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఆలా కోటేశ్వరరావు, గిరిజన హక్కుల నాయకులు విష్ణునాయక్‌, కె.వెంకటేశ్వర్లు, చంద్రనాయక్‌, ఏసుబాబు, లక్ష్మణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:12:48+05:30 IST