అకాడమి ఏర్పాటు.. అభినందనీయం

ABN , First Publish Date - 2022-12-31T00:47:47+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషియల్‌ అకాడమిని భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ ధనంజయ వై చంద్రచూడ్‌ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అమరావతి రాజధానిలోని మంగళగిరి వద్ద కాజా గ్రామంలో ఏర్పాటు చేసిన అకాడమీని శిలాఫలకం ఆవిష్కరించి న్యాయవ్యవస్థకి అంకితం చేశారు.

అకాడమి ఏర్పాటు..  అభినందనీయం

గుంటూరు, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషియల్‌ అకాడమిని భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ ధనంజయ వై చంద్రచూడ్‌ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అమరావతి రాజధానిలోని మంగళగిరి వద్ద కాజా గ్రామంలో ఏర్పాటు చేసిన అకాడమీని శిలాఫలకం ఆవిష్కరించి న్యాయవ్యవస్థకి అంకితం చేశారు. అంతకంటే ముందు సీజేఐకి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అకాడమిని ప్రారంభించిన తర్వాత ఆయన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, సీనియర్‌ జడ్జీలు సీ ప్రవీణ్‌కుమార్‌, ఏవీ శేషాయి, యు దుర్గాప్రసాదరావు, డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌తో కలిసి భవనాన్ని పరిశీలించారు. తరగతి గదులు, కాన్ఫరెన్స్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, రెస్టు రూంలను సందర్శించారు. సకల సదుపాయాలతో ఏపీ జ్యూడీషియల్‌ అకాడమిని ఏర్పాటు చేసినందుకు హైకోర్టు న్యాయమూర్తులను అభినందించారు. అకాడమి వద్ద సీజేఐకి పోలీసులు గాడ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీజేఏ డైరెక్టర్‌ ఏ హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌పీ ఆరిఫ్‌ హఫీజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి ఏఎన్‌యూలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు సీజేఐ, హైకోర్టు జడ్జీలు బయలుదేరి వెళ్లారు.

ఏఎన్‌యూలో సీజేఐ కీలకోపన్యాసం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో హైకోర్టు డిజిటైజేషన్‌, న్యూట్రల్‌ సైటేషన్‌, ఈ-సర్టిఫైడ్‌ కాపీ అప్లికేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీజేఐ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో హైకోర్టు వార్షిక నివేదికని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలపై హైకోర్టు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ని ఆయన పరిశీలించారు. అనంతరం సీజేఐ చంద్రచూడ్‌ ప్రసంగిస్తూ ఏపీ హైకోర్టుకు ఎంతో ఘనమైన చరిత్ర, సంప్రదాయం ఉంది. న్యాయవ్యవస్థలో స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు పాత సంప్రదాయాలను పాటిస్తూ కొత్త విధానాల అమలుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగింది. దానిని అందిపుచ్చుకొంటూ ఏపీ హైకోర్టు డిజిటైజేషన్‌ ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అభినందనీయం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. న్యాయమూర్తులు నిత్యవిద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. కోర్టులు న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో కేసుల కంటే నాణ్యతకి అధిక ప్రాధాన్యం కనబరచాలన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడమే కాదని, అవి సుస్థిరంగా ఉండేలా చూడాలన్నారు. సుస్థిరం అంటే ఆర్థికంగా కాదని అమలు చేసే విధానాల్లోనని చెప్పారు. జ్యూడీషియల్‌ వృత్తిలోకి ఒకప్పుడు పురుషులే ఎక్కువగా ఉండేవారని నేడు పురుషులు, మహిళలు సమానంగా వస్తోన్నారని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే భవిష్యత్తు జ్యూడీషియరీ మహిళల చేతుల్లో ఉంటుందన్నారు. ఎన్‌జేడీజీ డేటా ప్రకారం గుంటూరులో లాంగ్‌ పెండింగ్‌ సివిల్‌ కేసు 1980 మార్చి 22న నమోదైంది. పాత క్రిమినల్‌ కేసులు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కోర్టులో 1978 సెప్టెంబరు 19న నమోదైందన్నారు. గుంటూరు జిల్లాలో 1980 నుంచి 1990 వరకు చూసుకొంటే నాలుగు సివిల్‌, ఒక క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అనంతపురంలో 1978 నుంచి 1988 వరకు చూసుకొంటే 9 క్రిమినల్‌, ఒక సివిల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తే ఆయా జిల్లాల్లో కోర్టుల గడియారాన్ని 10 ఏళ్ల ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత దీర్ఘకాల పెండింగ్‌ క్రిమినల్‌ కేసు గోదావరి జిల్లాలో నమోదైంది. 1972లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కోర్టుకు 2006లో వచ్చిందన్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా చూసుకొంటే సరైన డాక్యుమెంటేషన్‌, రికార్డు లేని కారణంగా 14 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలిందన్నారు. అలానే కేసులు వాదించే కౌన్సెల్‌ లేకపోవడం వలన మరో 63లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటన్నింటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ-కోర్టుల సర్వీసెస్‌ని గ్రామస్థాయికి తీసుకెల్లి ప్రతీ ఒక్కరూ దానిని వినియోగించుకొనేలా చేయాలన్నారు. మనం ఇప్పుడు పాత కేసుల రికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తోన్నామని, ఐదేళ్ల తర్వాత 2023 నుంచి 2028 వరకు నమోదైన కేసులు డిజిటైజేషన్‌ చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ఇప్పటి నుంచే ఎలకా్ట్రనిక్‌ విధానంలో అన్ని ప్రక్రియలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

న్యాయకోవిదుడు జస్టిస్‌ చంద్రచూడ్‌

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ భారత న్యాయవ్యవస్థకు దేవుడి ఇచ్చిన వరంగా సీజేఐ చంద్రచూడ్‌ని ప్రశంసించారు. ఎన్నో కీలకమైన కేసుల్లో తీర్పులు ఇచ్చిన దిగ్గజ న్యాయకోవిదుడన్నారు. ఆయన చేతులు మీదగా ఏపీ జ్యూడీషియల్‌ అకాడమిని ప్రారంభించుకోవడం ఏపీ న్యాయవ్యవస్థలో ఇదో చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. 2019 జవనరిలో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు జూనియర్‌ జడ్జీలు ఎలాంటి శిక్షణ పొందలేకపోయారన్నారు. దీనికి కారణం జ్యూడీషియల్‌ అకాడమి లేకపోవడమేనన్నారు. హైకోర్టు ఏర్పాటైన తర్వాత 2021 వరకు 79 జూనియర్‌ సివిల్‌ జడ్జీల నియామకం జరిగింది. ఇటీవలే మరో 21 జూనియర్‌ సివిల్‌ జడ్జీలు ఎంపికయ్యారు. వాళ్లు అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అలానే గత ఏడాది 21 సీనియర్‌ సివిల్‌ జడ్జీలు జిల్లా జడ్జీలుగా పదోన్నతి పొందారు. 27 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలు సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పదోన్నతి పొందారు. వారంతా నేడు ఈ సదస్సులో పాల్గొంటోన్నారు. అకాడమి ఏర్పాటుతో వారికి పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజన జరగకముందు హైకోర్టులో 990 మంది ఉద్యోగులుంటే కేవలం 316 మంది మాత్రమే ఏపీకి కేటాయించారని తెలిపారు. 2015 నుంచి జిల్లా కోర్టుల్లో నియామకాలు లేవన్నారు. దీని వలన సిబ్బంది కొరత ఉందన్నారు. ఇటీవలే 241 పోస్టులు హైకోర్టులో భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. అలానే 3,410 పోస్టులు జిల్లా కోర్టుల్లో భర్తీ చేయాల్సి ఉందన్నారు. వీటిని నోటిఫై చేయడం జరిగిందన్నారు. 2023 సంవత్సరం మధ్యాంతరానికి పోస్టులు భర్తీ చేయాలని చూస్తోన్నామన్నారు. కొవిడ్‌ సమయంలో 3.27 లక్షల వర్చువల్‌ హియరింగ్‌లు నిర్వహించామన్నారు. రికార్డుల డిజిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టామని, దీని వలన భవిష్యత్తులో కేసుల విచారణ సులభతరం అవుతుందన్నారు. చీఫ్‌ జస్టిస్‌ ప్రసంగం అనంతరం ఆయన్ని హైకోర్టు న్యాయమూర్తులు శాలువా, వెంకటేశ్వరస్వామి ప్రతిమతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రూపు ఫోటో దిగారు. చివరగా జస్టిస్‌ ఏవీ శేషసాయి వందన సమర్పణ చేయగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

Updated Date - 2022-12-31T00:47:49+05:30 IST