అన్ని పీఎస్‌ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-11-24T00:39:36+05:30 IST

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

అన్ని పీఎస్‌ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
, సమావేశంలో పాల్గొన్న ఎస్పీ రవి శంకర్‌రెడ్డి, అదనపు ఎస్పీ బిందు మాధవ్‌, రామచంద్రరాజు తదితరులు

నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలి

జిల్లా నేర సమీక్షలో ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆదేశాలు

నరసరావుపేట లీగల్‌, నవంబరు 23: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అక్టోబరుకు సంబంధించి జిల్లా పోలీసు అధికారులతో జరిగిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యక్రమాల కట్టడికి ప్రజా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వాహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి అధికారి తమ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఫ్యాక్షన్‌ గ్రామాలపై దృష్టి సారించి ఆయా గ్రామాలను తరచూ సందర్శిస్తూ ఉండాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టి ఫ్యాక్షన్‌ గొడవలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలపై నేరాలకు, పోక్సో కేసుల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసి శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను, వేగ నియంత్రికలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు బిందు మాధవ్‌, రామచంద్రరాజు, డీఎస్పీలు విజయ్‌ భాస్కరరావు, విజయభాస్కర్‌రెడ్డి, జయరామ్‌ ప్రసాదు, రవిచంద్ర, చిన్న కృష్ణ, సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

అధికారులకు సత్కారం

వివిధ కేసుల్లో ప్రతిభ చూపిన అధికారులను ఎస్పీ రవిశంకరరెడ్డి సత్కరించారు. డీఎస్పీలు విజయ భాస్కర్‌రెడ్డి, జయరామ్‌ ప్రసాద్‌, యూ రవిచంద్రలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇంటిలిజెన్స్‌ డీఎస్పీగా బదిలీ అయిన కమలాకర్‌ను సత్కరించారు. ఏపీలో ఇటీవల జరిగిన పరీక్షల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జి, తెలంగాణలో నిర్వహించిన పరీక్షల్లో జిల్లా జడ్జిగా ఎంపికైన గుంటూరు జిల్లా ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఏపీపీ, పల్నాడు జిల్లా దిశ డీఎస్పీ రవిచంద్ర సతీమణి రాచపూడి శ్రీదేవిని

సత్కరించారు. వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివి జిల్లా జడ్జి కావాలన్న కోరికను నెరవేర్చుకున్నారని అభినందించారు.

Updated Date - 2022-11-24T00:39:45+05:30 IST