ఆరు నెలలైనా.. అరకొరే!

ABN , First Publish Date - 2022-10-04T06:00:24+05:30 IST

జిల్లా ఆవిర్భావం జరిగి మంగళవారానికి సరిగ్గా ఆరునెలలవుతోంది. కానీ ఇప్పటికీ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.

ఆరు నెలలైనా.. అరకొరే!
పనులు జరుగుతున్న కలెక్టర్‌ చాంబర్‌

ఇంకా సిద్ధం కాని జిల్లా కార్యాలయాలు

పొరుగుపంచనే పలు శాఖలు

వెంటాడుతున్న మౌలిక వసతుల కొరత

అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న పలు విభాగాలు

పురోగాభివృద్ధికి ప్రతిబంధకంగా నిధుల లేమి


బాపట్ల, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆవిర్భావం జరిగి మంగళవారానికి సరిగ్గా ఆరునెలలవుతోంది. కానీ ఇప్పటికీ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వ్యవసాయశాఖ, బీసీ సంక్షేమం, డీఈవోతో  పాటు పలు కార్యాలయాలు ఇంకా కళాశాలల భవన సముదాయాల్లోనే కొనసాగుతున్నాయి. స్రీశిశు సంక్షేమ కార్యాలయం బాలసదన్‌లో కొనసాగుతోంది. జిల్లా ఆవిర్భవించిన ఏడాదిలోపే సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ఏర్పరచి అన్ని కార్యాలయాలను అక్కడకు తరలిస్తామని ప్రభుత్వం చెప్పినా.. అడుగు ముందుకు పడలేదు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నివాస భవనాలు కూడా ఇంతవరకు సిద్ధం కాలేదు.


ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే ఇంకా..

కీలకమైన వివిధ శాఖలు ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే సేవలందిస్తున్నాయి. ముఖ్యంగా గనుల శాఖ విషయంలో ప్రభుత్వంవైపు నుంచి కదలికే కరువైంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ శాఖ విభజన జరిగితే కొంతమేర నిధుల లభ్యత పెరిగే అవకాశం ఏర్పడేది. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయాల జాడే లేదు. జడ్పీ ఉమ్మడి జిల్లాగానే కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. కానీ నిధుల పంపకం విషయంలో మార్గదర్శకాలు ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆరోగ్యశ్రీ, సైనిక సంక్షేమం, విజిలెన్స్‌, అవినీతి నిరోధకశాఖ, ఇంటర్‌బోర్డు, స్టెప్‌, ఉపాధి కల్పన కార్యాలయాలు ఇలా చాలా కార్యాలయాలు ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే పనిచేస్తున్నాయి.


అరకొర సిబ్బంది....వసతులు అంతంతే...

దాదాపు ఏ విభాగంలో కూడా ఉండాల్సిన నిష్పత్తిలో సిబ్బందిని ఇంతవరకు కూడా కేటాయించలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహనిర్మాణశాఖలో అయితే సిబ్బంది మరీ తీసికట్టుగా ఉన్నారు. ఉన్న కొద్దిమంది కూడా అవుట్‌సోర్సింగ్‌ వారే. ఇక మార్కెటింగ్‌, ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ, రిజిస్ట్రేషన్‌ ప్రతిశాఖలోనూ సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. మౌలిక వసతుల కల్పన కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కార్యాలయాల్లో అయితే సరిపడా కంప్యూటర్లు లేక ఉన్నవాటినే మార్చిమార్చి వాడుకుంటున్నారు.  


నిధుల మాటెత్తితే ఒట్టు..

ప్రతిశాఖకు  నిబంధనల ప్రకారం కనీస అవసరాల కోసం నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. కానీ అలా ఇవ్వకపోగా ఉన్న నిధులన్నింటినీ ఊడ్చేసి ప్రభుత్వం వేరే ఖాతాలకు మళ్లించడంతో స్టేషనరీకి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. తాజాగా గ్రానైట్‌ వ్యాపారులతో సమావేశమైన జాయింట్‌ కలెక్టర్‌ నిధులు ఇబ్బందిగా ఉంది.. మౌలిక సదుపాయాల కల్పనకు మీ వంతు సహకారం అందించాలని కోరడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. కనీస అవసరాలే గగనమైనప్పుడు కొత్త జిల్లాలో అభివృద్ధి ప్రణాళికలు, వాటి అమలు గురించి మరచిపోవడమే మేలన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు.

ఉన్న అరకొర వసతులతోనే మెరుగైన పాలనను ప్రజలకు అందించడానికి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమీక్షలు జరిపి ప్రజలతో మమేకమవుతున్నారు. సమీక్షా సమావేశాల్లో నిధుల ఇబ్బంది గురించి ఆమె ముందు విభాగాధిపతులు ఏకరువు పెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో టూరిజం అభివృద్ధి మీద ఆమెకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నప్పటికీ నిధుల విషయంలో సహకారం లేకపోవడంతో దానిని పక్కకు పెట్టారు.

 

Updated Date - 2022-10-04T06:00:24+05:30 IST