వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-05-20T04:49:27+05:30 IST
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.

సాగునీటి సలహా మండలి సమావేశంలో కలెక్టర్
జూన్ 10న సాగునీటి విడుదలకి ప్రభుత్వ చర్యలు
అధికారులపై ఉమ్మారెడ్డి ఆగ్రహం.. కరణం ప్రశ్నల వర్షం
బాపట్ల, మే 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సాగునీటి సలహా మండలి తొలి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 10న సాగునీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. రైతులు ముందుగా పంటలు వేసుకునే విధంగా చైతన్యపరచాలన్నారు. జిల్లాలో సాగునీటి కాల్వల మరమ్మతుల కోసం రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. కావూరివారిపాలెం, నక్కలవారిపాలెంలో దిగువ ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పోతుల సునీత కోరారు. సేంద్రియ వ్యవసాయంతోనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ సలహామండలి చైర్మన్ దశరథమహారాజు తెలిపారు. తాగునీటికి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా ఉంటే అందుకోసం మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటని అధికారులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశ్నించారు. స్టూవర్టుపురం చానెల్‌కు సంబంధించి రెండు వర్క్స్ ఆమోదం పొందాయని అధికారులు చెప్పడంతో ఆమోదం కాదు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పాలన్నారు. అనుకోని వరదల వల్ల పొలాలు మునిగిపోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో కాల్వల గురించి అధికారులు మాట్లాడుతుంటే నియోజకవర్గానికి పరిమితం చేసి మాట్లాడడం సరికాదని జిల్లా వ్యాప్తంగా చూడాలన్నారు. చీఫ్‌విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో ఎదురుగా ఉన్న అధికారులు వారిలో వారు ఏదో చర్చించుకుంటుండంతో ముందు చెప్పేది శ్రద్ధగా వినాలని వారిపై ఆయన కోప్పడ్డారు. సీ వాటర్ వెనక్కి తన్నడం వల్ల సాగుభూములకు నష్టం వాటిల్లి భూసారం దెబ్బతింటుందని, దానిని అరికట్టడానికి సమగ్ర ప్రణాళిక రూపాందించాలన్నారు. ఆక్వా సాగు వల్ల వేల ఎకరాలు కలుషితమవడమే కాక భూగర్భ జలాలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. వాటిపై తగిన విధంగా సర్వేలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆయన కోరారు
టీటీడీకి.. సేంద్రియ శనగలు
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేసిన తాను వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ విధానంలో సాగు చేసిన శనగలను తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కోసం తీసుకుందని కొరిశపూడి మండలం రాచపూడి గ్రామానికి చెందిన యువరైతు రఘురాం తెలిపారు. సాగునీటి సలహా మండలి సమావేశం అనంతరం జరిగిన వ్యవసాయ సలహా మండలి జిల్లా సమావేశంలో ఆయన తన అనుభవాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఇది తాను సాధించిన విజయమని చెప్పుకొచ్చారు. ప్రణాళిక బద్ధంగా వ్యవసాయం చేస్తే లాభాలు వస్తాయని వివరించారు. ఇష్టారీతిన పురుగుమందుల వాడకాలు తగ్గించాలని రైతులకు సూచించారు. ఈ సమావేశాల్లో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.కె.అబ్దుల్ సత్తార్, జలవనరులు, సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు