అమృతోత్సాహం
ABN , First Publish Date - 2022-08-15T06:14:06+05:30 IST
దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా జరగనున్నాయి. ఆదివారం సాయంత్రానికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఎటుచూసినా మువ్వన్నెల శోభ
జిల్లా అంతటా వేడుకలకు ఏర్పాట్లు
ప్రదర్శనలు, ర్యాలీలతో చిన్నాపెద్దా సందడి
ఇంటింటా జెండాలను ఎగరువేసిన ప్రజానికం
మువ్వన్నెల వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలు
76వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబు
ఆజాదీకా అమృతోత్సవాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి ప్రజలందరిలోనూ జాతీయ భావం వెల్లువెత్తింది. 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే పల్లె పట్టణం అన్న తేడా లేకుండా జాతీయ జెండాల ఆవిష్కరణలు, ర్యాలీలతో దేశభక్తి భావన పెల్లుబికింది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రజలు సందడి చేశారు. ఇంటింటా ప్రజలు పతాకాలను ఎగురవేశారు. మువ్వన్నెల విద్యుత్ దీపాల అలంకరణలతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కాంతులు వెదజల్లాయి. ప్రధాన మార్గాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. గుంటూరులో ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా జరగనున్నాయి. ఆదివారం సాయంత్రానికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లాలో ఎటు చూసినా జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలు, జెండాలతో శోభాయమానంగా మారింది. ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పెద్దఎత్తున భాగాస్వామ్యం అయ్యాయి. తమ కార్యాలయాలను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైటింగ్‌తో సర్వాంగ సుందరంగా అలంకరించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో అట్టహాసంగా సాంతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్షం కురిసినా ఈ వేడుకకు హాజరయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా చేశారు. ఇక వివిధ సంఘాలు, సంస్థలు ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాలతో ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శనలు చేశారు. గుంటూరులోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ఇన్చార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు జాతీయ జెండాని ఎగుర వేసి గౌరవ వందనం స్వీకరించనున్నారు. గుంటూరు రైల్వేస్టేషన్, పట్టాభిపురంలోని రైల్వికాస్భవన్లు కళ్లు మిరుమిట్లు గొలిపేలా దగదగలాడుతోన్నాయి. రైల్వే బోగీలు, ఇంజిన్లను జాతీయ జెండా స్టిక్కర్లతో అలంకరించారు. 19 రైల్వేస్టేషన్లలోని 50 స్టాల్స్‌ని స్టిక్కరింగ్ చేశారు. ఐటీసీ సంస్థ సౌజన్యంతో భారీ ఎల్ఈడీ తెరని గుంటూరు రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేయించారు. ఆజాదీ కా రైల్‌గాడి ఔర్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. స్థానిక నగరంపాలెంలోని ఐటీసీ ప్రధాన కార్యాలయం, రింగురోడ్డులోని వెల్కం ఫైవ్‌స్టార్ హోటల్ని జాతీయభావం ఉప్పొంగేలా అలంకరించారు.
- బాపట్లలోని పరేడ్‌గ్రౌండ్ మొదటిసారిగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా చేపట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ కె.విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి.
- పల్నాడు జిల్లా ఏర్పాటు అనంతరం తొలి సారిగా నరసరావుపేటలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం కోసం డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆద్వర్యంలో ఆదివారం పోలీసు కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఇన్చార్జి మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వినుకొండలోని గీతాంజలి రెడిడెన్షియల్ స్కూల్లో 800 మీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి, కరస్పాండెంట్ వై.ఎల్.కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.