సమయానికి హాజరు వెయ్యాలంతే!

ABN , First Publish Date - 2022-12-15T03:42:46+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), సర్వేయర్ల హాజరుపై సర్కారు సీరియస్‌ అయింది.

సమయానికి హాజరు వెయ్యాలంతే!

వీఆర్‌వో, సర్వేయర్లపై సర్కారు సీరియస్‌

రెవెన్యూ, సర్వే శాఖలకు సీఎంవో శ్రీముఖం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), సర్వేయర్ల హాజరుపై సర్కారు సీరియస్‌ అయింది. గ్రామ సచివాలయాల పరిధిలో నిర్దిష్ట సమయంలోగా వారు హాజరు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై విధిగా గ్రామ, వార్డు సచివాలయాలకు వీఆర్‌వోలు, సర్వేయర్లు సకాలంలో వెళ్లి హాజరు నమోదు చేసేలా మార్గదర్శకాలు జారీచేసి, వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖలను ఆదేశించింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా సచివాలయాల హాజరును సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించినట్లు తెలిసింది. ప్రత్యేకించి రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్‌వోలు, సర్వేయర్లు సకాలంలో హాజరు నమోదు చేయడంలేదని గమనించారు. ఇదే అంశంపై రెవెన్యూ, సర్వే, గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ విభాగాధిపతులకు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు లేఖ రాశారు. ‘‘వీఆర్‌వోలు, సర్వేయర్లు తమ పరిధిలోని గ్రామ సచివాలయాల్లో సకాలంలో హాజరు నమోదు చేయని అంశాన్ని మంత్రివర్గ సమావేశం లో ముఖ్యమంత్రి గుర్తించారు. ఇది ఇంతకుముందు జారీ చేసిన నిబంధనలకు విరుద్ధం. కాబట్టి నిర్దిష్ట కాలంలో నిబంధనల మేరకు హాజరు న మోదు చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఉద్యోగుల డిమాండ్‌ పట్టని సర్కారు

భూముల సమగ్ర సర్వే సందర్భంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమకు హాజరు సమయం నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది రెండేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. తమకు టైమ్‌ లిమిట్‌ పెట్టొద్దని, లేదా క్షేత్రస్థాయి నుంచే హాజరు నమోదుకు అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. భూముల సమగ్ర సర్వే నిమిత్తం క్షేత్రస్థాయికి వెళ్లే సిబ్బంది సకాలంలో హాజరు వేయకపోవడం నిబంధనలకు విరుద్ధమనడం సరికాదని రెవెన్యూ నిపుణుడు పద్మనాభయ్య పేర్కొన్నారు. ‘‘భూముల సర్వే లేకుంటే రెవెన్యూ సిబ్బంది కూడా సమయానికి ఆఫీసుకు వచ్చి అక్కడే పనిచేస్తారు. కానీ వారు ప్రస్తుతం ఫీల్డ్‌లో తిరుగుతున్నారు. హాజరు మినహాయింపు ఇవ్వాలని రెండేళ్లుగా కోరుతున్నా గుర్తించకుండా... అటెండెన్స్‌ వేయడం లేదని ఆక్షేపించడం దుర్మార్గం. రెవెన్యూ, సర్వే అధికారులు పెదవి విప్పకపోవడంతో ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లడం లేదు. ఇప్పటికైనా ఈ విషయంలో సర్కారు తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని పద్మనాభయ్య కోరారు.

Updated Date - 2022-12-15T03:42:47+05:30 IST