రాష్ట్రంలో కొరవడిన అంబేద్కర్ స్ఫూర్తి
ABN , First Publish Date - 2022-12-07T01:07:13+05:30 IST
జగన్‌మోహనరెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు జీవించే హక్కు కోల్పోయారని, రాష్ట్రంలో అంబేద్కర్ స్ఫూర్తి కొరవడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు
గుంటూరు(తూర్పు), డిసెంబరు 6: జగన్‌మోహనరెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు జీవించే హక్కు కోల్పోయారని, రాష్ట్రంలో అంబేద్కర్ స్ఫూర్తి కొరవడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం ఆయన పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ దళితుల, అణగారిన వర్గాల హక్కులను పూర్తిగా హరించి, రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం జగన్ ప్రభుత్వం హననం చేసిందని ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు రాజ్యాంగస్ఫూర్తితో పనిచేశాయని, కానీ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో రాజ్యాంగం అనేకసార్లు ఉల్లంఘనలకు గురైందని తెలిపారు. కార్యానిర్వాహక వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు, న్యాయవ్యవస్థపై దురుద్దేశాలు అపాదిస్తూ ప్రచారాలు చేశారన్నారు. జగన్ అధికారం చేపట్టాక దళితులకు అందించే 27 పథకాలను రద్దు చేయడంతోపాటు, ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని తెలిపారు. కార్యక్రమంలో నేతలు కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతురావు, కార్పోరేటర్ యల్లావుల అశోక్, ప్రజా సంఘాల నాయకులు సముద్రాల చినకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.