రాజధానిపై రాజకీయ కక్ష తగదు
ABN , First Publish Date - 2022-08-11T05:49:33+05:30 IST
అమరావతి రాజధానిని నాశనం చేయటానికే వైసీపీ అధికారంలోకి వచ్చినట్లుందని, ఇకనైనా కక్ష పెంచుకోవటం మాని అభివృద్ధికి పాడుపడాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వానికి అమరావతి ప్రాంత రైతులు, మహిళలు విజ్ఞప్తి
967వ రోజుకు రైతుల రాజధాని ఆందోళనలు
తుళ్ళూరు, ఆగస్టు 10: అమరావతి రాజధానిని నాశనం చేయటానికే వైసీపీ అధికారంలోకి వచ్చినట్లుందని, ఇకనైనా కక్ష పెంచుకోవటం మాని అభివృద్ధికి పాడుపడాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధప్రదేశ్, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం నాటికి 967వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయ వనరు అమరావతిని నాశనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. హైకోర్టు తీర్పును సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్నారంటే సీఎం జగన్ ఎంత నియంతృత్వంగా పాలన సాగిస్తున్నాడో ప్రజలకు అర్ధమవుతూనే ఉందన్నారు. రాజధానిని అభివృద్ధి చేయటం చేతకానప్పుడు వెల్లడించి పక్కకు తప్పుకోవటమే మంచిదన్నారు. రైతుల జీవనాధారమైన భూములిచ్చినందుకైనా ప్రభుత్వం రాజధానికి సహకరించాలని కోరారు. అమరావతి నిర్వీర్యంతో ఆంధ్రప్రదేశ్ ఉనికి కోల్పోయే ప్రమాదముందన్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. పాలకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతి రైతులను బలి చేయవద్దని వేడుకున్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.