కొంత మందికే కౌలు..

ABN , First Publish Date - 2022-07-01T05:28:14+05:30 IST

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమలు త్యాగం చేసిన రైతుల్లో అతి కొద్దిమందికి మాత్రమే సీఆర్‌డీఏ అధికారులు కౌలు చెల్లించారని, మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు.

కొంత మందికే కౌలు..
తుళ్లూరు ధర్నా శిబిరంలో ఆందోళనలు చేస్తున్న మహిళలు

926వ రోజుకు చేరిన రైతుల దీక్షలు

తుళ్లూరు, జూన్‌ 30: రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమలు త్యాగం చేసిన రైతుల్లో అతి కొద్దిమందికి మాత్రమే సీఆర్‌డీఏ అధికారులు కౌలు చెల్లించారని, మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలుచేయాలంటూ, రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 926వ రోజుకు  చేరాయి. ఈ సందర్భంగా  ధర్నా శిబిరాల నుంచి రైతులు,  రైతు కూలీలు మాట్లాడుతూ రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య కట్టిందని, వివక్ష చూపుతుం దని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో కొందరికి మాత్రమే కౌలు చెల్లించి మిగిలిన వారికి చెల్లించకపోవడంపై సీఆర్‌డీఏ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. అలాగే భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఎంతో కాలంగా పింఛన్‌ చెల్లింపు పెండింగ్‌లో ఉందని, వారికి వెంటనే ఆ నగదును జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల పట్ల సీఆర్డీఏ కమిషనర్‌ భాధ్యాతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం రాజధానికి అభివృద్ధి కోసం భూములను తాకట్టు పెడితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏకంగా రాజధాని భూములను ప్రయివేటు సంస్థ అప్పనంగా అమ్మేస్తుందని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల భూములు ఇస్తే వాటిని అమ్మే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. చీకటి జీవోలు తెచ్చి రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుకు కనీస గౌరవమిచ్చి అమరావతి అభివృద్ధి పనులు మొదలు పెడితే  ప్రజలు  కొంతైనా విశ్వసించేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోసం నిర్మించిన ఇళ్లు ప్రయివేటు సంస్థలకు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. ఈ చర్యలు సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌కు, సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకమన్నారు. సీఐడీ విచారణ పేరుతో అసైన్డ్‌ రైతులకు వార్షిక కౌల్లు చెల్లించకపోవటం దుర్మార్గమ న్నారు. ఇకనైనా పేద రైతుల పట్ల కక్ష్యసాధింపు మానుకోవాలన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి మేరకు హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాల్లో బిల్డ్‌ అమరావతి సేవ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేసి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.  రాజధాని ప్రాతంలోని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.


Updated Date - 2022-07-01T05:28:14+05:30 IST