మూడు నెలలు దాటినా.. కోర్టు తీర్పును అమలు చేయరా?

ABN , First Publish Date - 2022-06-08T05:11:15+05:30 IST

మూడు నెలలు దాటినా ఉన్నత న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం అమలు చేయటం లేదని రాజధానికి భూములిచ్చిన రైతులు పేర్కొన్నారు.

మూడు నెలలు దాటినా..  కోర్టు తీర్పును అమలు చేయరా?
మందడం శిబిరంలో రాజధాని రైతులు, మహిళలు

903వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 

తుళ్లూరు, జూన్‌ 7: మూడు నెలలు దాటినా ఉన్నత న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం అమలు చేయటం లేదని రాజధానికి భూములిచ్చిన రైతులు పేర్కొన్నారు. సీఆర్డీఏ  చట్టం ప్రకారం ప్రభుత్వంతో తమకు ఒప్పందం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చట్టాన్ని ఉల్లంఘించి అమరావతి అభివృద్ధిని నిలిపివేసిందని ఆరోపించారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 903వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి రైతులు మాట్లాడుతూ మూడేళ్ల నుంచి అమరావతిలో తట్ట మట్టి వేసింది లేదన్నారు. అందుకే హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందన్నారు. దాన్ని కూడా వక్రీకరించాలని చూశారన్నారు. ఇంతకంటే అరాచక పాలన ఏముందని ప్రశ్నించారు. అమరావతిని నిర్వీర్యం చేయటానికి రాజ్యాగంలోనే లేని మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి, అమరావతి అభివ ృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి  బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.  

Updated Date - 2022-06-08T05:11:15+05:30 IST