నియంత పాలన ఉండకూడదు

ABN , First Publish Date - 2022-04-05T06:25:42+05:30 IST

న్యాయస్థానాలంటే వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని, ప్రజాస్వామ్యంలో నియంత పాలన ఉండరాదని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియంత పాలన ఉండకూడదు
ఢిల్లీకి బయల్దేరే ముందు విజయవాడ రైల్వే స్టేషన్‌లో రాజధాని రైతు బృందం

న్యాయస్థానాలంటే లెక్క లేకపోతే ఎలా?

839వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు 

తుళ్లూరు, ఏప్రిల్‌ 4: న్యాయస్థానాలంటే వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని, ప్రజాస్వామ్యంలో నియంత పాలన ఉండరాదని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంఽధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 839వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, అమరావతిని అభివృద్ధి చేయమని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకపోగా, అసెంబ్లీలో వక్రభాష్యాలు సీఎం జగన్‌రెడ్డి చెప్పడం నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. నియంత భావం ఉంటే వెంటనే దిగిపోవాలని సూచించారు. న్యాయస్థానం తీర్పును అమలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయస్థానాలను గౌరవించకపోతే పెను ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. అమరావతి అభివృద్ధి చేయమంటే కుంటి  సాకులతో అఫిడవిట్‌ సీఎస్‌ ఇవ్వడం ఏమిటని  ప్రశ్నించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. జై అమరావతి అంటూ రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.

ఢిల్లీకి చేరిన రాజధాని అమరావతి ఉద్యమం

రాజధాని అమరావతి ఉద్యమం ఢిల్లీకి చేరుకుంది. ఆది, సోమవారాల్లో విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి రెండు బృందాలుగా బయల్దేరిన జేఏసీ నేతలు హస్తినకు చేరుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఉన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అమరావతిలో అభివృద్ధి కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. కేంద్ర సంస్థల కార్యాలయాలను అమరావతిలో నిర్మాణాలు చేయాలని విన్నవించనున్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, రైతు బృంద సభ్యులు గాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. శాంతి అహింస మార్గంలో మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడిచి న్యాయదేవత అండతో విజయం సాధించామన్నారు. నివాళులర్పించిన వారిలో దళిత జేఏసీ నేతలు గడ్డం మార్టిన్‌, పులి చిన్నా, చేకూరి రవి, దళిత మహిళా జేఏసీ కన్వీనర్‌ అంకం సువర్ణ కమల, ముస్లిం మైనార్టీ జేఏసీ నేత షేక్‌ జానీ, అమరావతి జేఏసీఅధ్యక్షుడు పువ్వాడ సుధాకర్‌, రాష్ట్ర  బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య,  మహిళా జేఏసీ నేతలు, రైతులు ఉన్నారు. 

Read more