మా బతుకులతో చెలగాటం
ABN , First Publish Date - 2022-07-02T05:29:12+05:30 IST
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చాం.. అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులంటూ మా బతుకులతో చెలగాటం ఆడుతున్నారు.

వార్షిక కౌలు, పింఛన్లు సరిగ్గా జమ చేయడం లేదు
రైతు ధర్నా శిబిరం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు ప్రదర్శన
తుళ్ళూరు, జూలై 1 : ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చాం.. అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులంటూ మా బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. భూములిచ్చింది రాజధాని నిర్మాణానికా లేక అమ్ముకోవటానికా అంటూ ప్రశ్నించారు. శుక్రవారం తుళ్లూరు రైతు ధర్నా శిబిరం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు రాజధాని రైతు కూలీలు, రైతులు, మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూమిలేని నిరుపేదల పింఛన్ వెంటనే చెల్లించాలని, అసైన్డ్ రైతులకు వార్షిక కౌలు జమ చేయాలని, ప్రభుత్వ భవనాలు అన్యాక్రాంతం చేయవద్దని, అమరావతిలో భూముల అమ్మకం నిర్ణయం వెంటనే నిలిపివేయాలని, రైతులను సంప్రందించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ సాయిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఆ సమయంలో దళిత రైతు రెండు సంవత్సరాల నుంచి కౌలు ఇవ్వటం లేదని పెళ్ళాం పిల్లలు ఎలా బతకాలంటూ పులి మరియదాసు (చిన్నా) డీసీ సాయిబాబు కాళ్ళ మీద పడ్డాడు. ఎకరన్నర అసైన్డ్ భూమి ఉంటే దానిని రాజధానికి ఇచ్చామని, కౌలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ, దళిత జేఏసీ నేతలు మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి పనులు చేయకుండా భూములు అమ్ముతామనే ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్థుల కోసం నిర్మించిన భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకొని ఉద్యోగస్థులకే కేటాయించాలని అన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేసి అమరావతి అభివృద్ధి పనులు వెంటనే మొదలు పెట్టాలని అధికారులను కోరుతున్నామన్నారు. సీఆర్డీఏ చట్టం అమలు చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతుందని, దానికి అధికారులు కూడా తోడవుతున్నారన్నారు. చట్టం అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు. కాదని వెళితే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఏడేళ్ల నుంచి కౌలు జమ చేస్తూ కొన్ని గ్రామాలలో అటవీ భూముల అనే సాకుతో కౌలు జమ చేయకపోవటం దారుణమన్నారు. టీడీపీ, సీపీఐ, బీజేపీ, సీపీఎం, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి పాల్గొన్నారు.