ఇవాళ్టికి అమరావతే రాజధాని

ABN , First Publish Date - 2022-11-30T03:41:20+05:30 IST

ఇవాళ్టికి అమరావతే రాజధాని అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇవాళ్టికి అమరావతే రాజధాని

మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడే ఉంది

వివేకా హత్యకేసు విచారణ బదిలీని స్వాగతిస్తున్నాం: సజ్జల

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఇవాళ్టికి అమరావతే రాజధాని అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే జనవరి 31న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులిచ్చే ఆదేశాలను బట్టి.. మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని చెప్పారు. అది జనవరిలోనా, ఏప్రిల్లోనా లేదా ఇంకెప్పుడా అనేది త్వరలోనే చెబుతామన్నారు. తాడేపల్లిలోని మీడియా సెంటర్‌ వద్ద ఆయన మంగళవారం మాట్లాడుతూ రాజధానిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. రాజధానికి సంబంధించి ప్రభుత్వం, వైసీపీ స్టాండ్‌కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుపై చంద్రబాబు ఎందుకు తన అభిప్రాయాన్ని చెప్పలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులపై ప్రభుత్వం కట్టుబడే ఉందని, దీనిపై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామని చెప్పారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పదిరోజులకో.. నెలకో వలస పక్షిలా రాష్ట్రానికి వచ్చి పోతున్నాడని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కు 15 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసిందన్నారు. ఒక్క సీటూ లేని పవన్‌ ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. కాగా.. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T03:41:20+05:30 IST

Read more