కౌన్సిలర్లు.. కమీషన్లు

ABN , First Publish Date - 2022-07-16T05:38:46+05:30 IST

తమ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నించాలి.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.. కాని ఆ విషయాన్ని విస్మరించి కమీషన్ల కోసం వాదులాడుకుంటున్న కౌన్సిలర్ల తీరుపై అద్దంకి నగర పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కౌన్సిలర్లు.. కమీషన్లు
అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం

బహిరంగంగా వాదులాటలు 

అద్దంకి నగర పంచాయతీలో గోలగోల


అద్దంకి, జూలై 15: తమ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నించాలి.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.. కాని ఆ విషయాన్ని విస్మరించి కమీషన్ల కోసం వాదులాడుకుంటున్న కౌన్సిలర్ల తీరుపై అద్దంకి నగర పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నగర పంచాయతీలో కౌన్సిలర్లు పర్సంటెజ్‌ల కోసం బహిరంగంగా వాదులాడుకోవడం చర్చనీయంశంగా మారింది.  నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా 13 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించే వార్డుల్లో అధికార పార్టీ తరపున పర్యవేక్షణకు వైసీపీ వార్డు ఇన్‌చార్జిలను నియమించింది. ఇటీవల వార్డుల వారీగా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఆయా పనులకు సంబంధించి వార్డుల వారీగా 5 శాతం చొప్పున పర్సంటేజ్‌ ఇచ్చేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఒకరిద్దరు కౌన్సిలర్లు తమకు పర్సంటేజీ అవసరం  లేదని పనులు నాణ్యతగా చేయాలని చెప్పినట్లు సమాచారం. ఇక మిగిలిన అధికారపార్టీ కౌన్సిలర్లు మాత్రం తమ వాటా పర్సంటేజ్‌ చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని హెచ్చరికలు జారీ చేశారని తెలిసింది. అదే సమయంలో ఇప్పటికే ప్రారంభం అయిన పనులకు సంబంధించి కూడా పర్సంటేజ్‌ లెక్కకట్టి మొత్తం కలిపి ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తుంది. టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించే వార్డుల్లో పనులకు సంబంధించి  పర్సంటేజీ వ్యవహారంపై వైసీపీ తరపున నియమితులైన వార్డు ఇన్‌చార్జిలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.  ఇదిలా ఉంటే పట్టణ పరిధిలోని అని వార్డుల్లో ఎన్నికల ఖర్చు కోసం తాను పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు, అందుకుగాను కమీషన్‌లో కొంత వాటా తనకు చెందాలని ఓ కౌన్సిలరు  పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటీవల మంజూరు చేసిన పనుల్లో కొన్ని వార్డుల్లో ఎక్కువ నిధులు కేటాయించారు. దీంతో ఆ వార్డు కౌన్సిలర్ల ఎక్కువ మొత్తంలో పర్సంటేజ్‌ వస్తుందనే ఆలోచనతో నగర పంచాయతీలో కీలకంగా వ్యవహరించే కౌన్సిలర్‌ సగం వాటా కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.   వైసీపీ వార్డు ఇన్‌చార్జిలకు కాకుండా ఆ కమీషన్‌ కూడా తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. పంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల    రోడ్డుపై అందరి సమక్షంలో వార్డు కౌన్సిలర్లు కమీషన్ల అంశంపై వాదులాడుకున్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్లను పిలిచి పర్సంటేజ్‌ల విషయం అడగడం చర్చనీయాంశంగా మారింది.   


 

Updated Date - 2022-07-16T05:38:46+05:30 IST