పది పరీక్షలపై.. సన్నద్ధత ఏదీ?
ABN , First Publish Date - 2022-11-14T23:24:26+05:30 IST
ఓ వైపు ఆలస్యంగా ప్రారంభమైన పాఠశాలలు, మరోవైపు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు బదిలీలు, పదోన్నతుల్లో ఇంకా తొలగని సందిగ్ధత, అధికారుల పర్యవేక్షణాలోపం.. వెరసి పదో తరగతి విద్యార్థులపై ప్రభావం చూపుతోంది.
గుంటూరు(విద్య), నవంబరు14: ఓ వైపు ఆలస్యంగా ప్రారంభమైన పాఠశాలలు, మరోవైపు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు బదిలీలు, పదోన్నతుల్లో ఇంకా తొలగని సందిగ్ధత, అధికారుల పర్యవేక్షణాలోపం.. వెరసి పదో తరగతి విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. పది విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. అత్యధిక పాఠశాలల్లో 50శాతం నుంచి 60శాతం కూడా సిలబస్ పూర్తికాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
విభజిత గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యాల ఆధ్వర్యంలో 490 ఉన్నత పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలల్లో 29,961 మంది పదో తరగతి చదువుతున్నారు. పల్నాడు జిల్లాలో 476 పాఠశాలల్లో 26,827 మంది, బాపట్ల జిల్లాలో 215 పాఠశాలల్లో 12,466 మంది టెన్త్ చదువుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈఏడాది దాదాపు నెలరోజుల ఆలస్యంగా అంటే జూలై 5న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కొన్నిరోజులు ఆన్‌లైన్ క్లాసులు అంటూ హడావిడి చేసిన అధికారులు తరువాత ఆగస్టులో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించారు. ఫలితంగా దాదాపు రెండునెలలు సిలబస్ ఆలస్యం అయింది. దీంతో నవంబరు మొదటివారం వరకు దాదాపు 90శాతం పాఠశాలల్లో 50 నుంచి 60శాతం కూడా సిలబస్ పూర్తికాని పరిస్థితి నెలకొంది.
ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి
ఉమ్మడి జిల్లాలో బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదోన్నతలు ఇటీవల తూతూమంత్రంగా ముగిసినా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. ప్రతిసారి వేసవిలో ముగించే బదిలీల ప్రక్రియ ఈసారి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర నిర్లిప్తతలో ఉన్నారు. బదిలీలు జరిగిన తరువాత వెళ్లే పాఠశాలలపైనే దృష్టిపెడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో సిలబస్‌ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు మున్సిపల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క మంగళగిరి కార్పొరేషన్‌లోని ఉన్నత పాఠశాలలో 1,150 మంది విద్యార్థులకు కేవలం 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అంతమందికి ఎలా పాఠాలు చెబుతారని మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్.రామకృష్ణ పేర్కొన్నారు. దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో, కార్పొరేషన్స్‌లో పరిస్థితి ఇలానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిల్..
పది విద్యార్థుల్ని పరీక్షలకు సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా జిల్లాల్లో నిర్వహించలేదు. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలస్థాయిలో ఎంఈవోలు సగటున రోజుకు కనీసం ఒక్క పాఠశాలను కూడా సందర్శించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్టడీ మెటీరియల్ పంపిణీ, విద్యార్థులకు అల్పాహారం.. అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.